న్యూఢిల్లీ: గత కొంతకాలంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంటికే పరిమితం కావడంతో అతని రిటైర్మెంట్ ఎప్పుడు అనే మాటే తరచు వినిపిస్తోంది. ఈ ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టులో ధోని కనిపించలేదు. అయితే జనవరి తర్వాతే తన నిర్ణయాన్ని చెబుతానని ధోని సూచనప్రాయంగా ఇటీవల వెల్లడించాడు. కాగా, జనవరి నెలకు ఎన్నో రోజులు లేకపోవడంతో ధోని భవిష్య కార్యాచరణ ఏమిటి అనేది మరోసారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి ధోని కెరీర్ గురించి ప్రశ్న ఎదురైంది.
దీనిపై గంగూలీ సమాధానమిస్తూ.. ‘ ఇప్పుడు ధోని రిటైర్మెంట్ గురించి మాట్లాడటానికి సరైన సమయం కాదు.. ఇది సరైన వేదిక కూడా కాదు. తన కెరీర్ గురించి ధోని త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటాడు. అది సెలక్టర్లకు, కెప్టెన్ కోహ్లికి తెలియజేస్తాడు. కోహ్లితో ధోని టచ్‌లోనే ఉన్నాడు. తన భవిష్య ప్రణాళికలు గురించి ఇప్పటికే కోహ్లికి చెప్పి ఉంటాడు. అది ఏమటన్నది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది’ అని గంగూలీ పేర్కొన్నాడు.భారత్ జట్టుకు టీ20 వరల్డ్‌కప్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ, వన్డే వరల్డ్‌కప్‌లను సాధించి పెట్టిన ఘనత ధోనిది. దీన్ని ఉదహరిస్తూనే మాట్లాడిన గంగూలీ.. భారత క్రికెట్ జట్టుకు మరో ధోనిని వెతికిపట్టుకోవడం చాలా కష్టమన్నాడు. అది మనం అనుకున్నంతా సులువుగా జరగపోవచ్చన్నాడు. అయితే ధోని ఆడాలా.. లేక రిటైర్మెంట్ ప్రకటించాలా అనే విషయం అతనికే వదిలేద్దామని గంగూలీ మరోసారి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment