
ముంబై: టీమిండియా సారథి విరాట్ కోహ్లితో రేపు(గురువారం) తొలి సమావేశం కానున్నట్లు బీసీసీఐ తాజా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. బుధవారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం గంగూలీ అధ్యక్షతన పూర్తిస్థాయి బోర్డు సమావేశం జరిగింది. బోర్డు మీటింగ్ అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో తొలిసారి మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం టీమిండియా అద్భుతంగా ఉందని, కెప్టెన్ కోహ్లికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రకటించాడు. అదేవిధంగా ఎంఎస్ ధోనితో కూడా సమావేశం కానున్నట్లు తెలిపాడు.
‘కోహ్లితో రేపు సమావేశమవుతాను. ప్రస్తుతం భారత క్రికెట్‌లో అత్యంత ప్రధానమైన వ్యక్తి కోహ్లినే. గత మూడు నాలుగేళ్లలో టీమిండియా అపూర్వ విజయాలను సాధించింది. అన్ని విభాగాల్లోనూ బలంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే టీమిండియాను మేటి జట్టుగా చేయలనేది కోహ్లి తాపత్రయం. అతడికి అన్ని విధాలం అండగా ఉంటాం. టీమిండియాకు కావాల్సిన అన్ని సదుపాయాలను సమకూరుస్తాం. టీమిండియా విన్నింగ్ టీం. మీరు అడగొచ్చు టీమిండియా ప్రపంచకప్ గెలవలేదు కదా విన్నింగ్ టీమ్ ఎలా అవుతుందని.. కానీ ప్రతీసారి ప్రపంచకప్ గెలవలేము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెటర్ల సంక్షేమానికి చర్యలు తీసుకుంటాం. ఐసీసీ నుంచి భారత్‌కు రావాల్సిన బకాయిలను రాబడతాం’అని గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment