ధోనికి 'ప్రమోషన్' అవసరం!
కటక్:మహేంద్ర సింగ్ ధోని ఎంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన రెండో వన్డేలో ధోని భారీ సెంచరీ సాధించాడు. నిన్నటి మ్యాచ్లో ధోని 10 ఫోర్లు , 6 సిక్సర్లతో 134 పరుగులు సాధించాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్గా పగ్గాలను ధోని వదులుకున్నా తనలోని సత్తా తగ్గలేదని నిరూపిస్తూ శతకాన్ని అవలీలగా బాదేశాడు. ధోని చాలా కాలం తరువాత సెంచరీ చేయడానికి ప్రధాన కారణం అతని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పే. ఇంగ్లండ్ పై ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని అమూల్యమైన పరుగులు సాధించాడు.
గతంలో ధోని కెప్టెన్గా ఉన్న సమయంలో అతను ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చేవాడు. భారత జట్టుకు ఏడో స్థానంలో ఆడగల సమర్థుడైన ‘ఆల్‌రౌండర్’ లేడని... అతను దొరికే వరకు ఆశించిన ఫలితాలు భారత్ కు రావనేది ధోని అప్పటి అభిప్రాయం. ఆ క్రమంలోనే ధోని ఎక్కువగా ఏడో స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చి భారత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దేవాడు. గతంలో బ్యాటింగ్ ఆర్డర్ లో ధోని కింది వరుసలో రావడం వల్ల హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మార్చే అవకాశం తక్కువగా ఉండేది. తన వన్డే కెరీర్ లో 61 హాఫ్ సెంచరీలను సాధించిన ధోని.. సెంచరీల విషయంలో మాత్రం వెనుకబడిపోయాడు. కేవలం ధోని వన్డే కెరీర్ లో 10 సెంచరీలు మాత్రమే ఉండటానికి కారణం అతను బ్యాటింగ్ ఆర్డర్ లో కింది స్థానంలో రావడమే.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. భారత బ్యాటింగ్ బలం అమోఘంగా ఉంది. ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా లాంటి ఆల్ రౌండర్ ఉంటే, ఎనిమిదో స్థానంలో రవీంద్ర జడేజా రూపంలో మరో ఆల్ రౌండర్ కూడా ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ధోని బ్యాటింగ్కు మరింతపైకి ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంగ్లండ్ తో రెండో వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. అద్భుతమైన ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. భారత్ జట్టు క్లిష్ట పరిస్థితులోపడ్డ సమయంలో ధోని చక్కటి ఇన్నింగ్స్ ను నెలకొల్పాడు. యువరాజ్ సింగ్ తో కలిసి 256 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించాడు. దాంతో బ్యాటింగ్ ఆర్డర్ను మార్చాల్సేందేననే వాదన వినిపిస్తోంది.
టీమిండియాలో కీలక ఆటగాడైన ధోనిని ముందు వరుసలోకి తీసుకొస్తే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. దీన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా సమర్ధిస్తున్నాడు. ఇక నుంచి ధోనిని మరింత పైకి తీసుకొస్తే భారత్ జట్టుకు మరింత మేలు జరగడం ఖాయమని అభిప్రాయపడ్డాడు. ఈ విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లి పరిగణలోకి తీసుకుని ధోనిని టాపార్డర్లో ఆడించాలని సూచించాడు. ' ఇక నుంచి ధోని బ్యాటింగ్ ఆర్డర్ మారాలి. అతని బ్యాటింగ్ ఆర్డర్ మారితే ఫలితం ఎలా ఉంటుందో చూశాం. అతను కొట్టిన భారీ సిక్సర్లు అతనిలో ప్రతిభ తగ్గలేదనడానికి ఉదాహరణ. సాధ్యమైనంత వరకూ ధోనిని టాపార్డర్ లో ఆడించే యత్నం చేయండి. అది టీ 20 క్రికెట్ లోనైనా, వన్డేల్లోనైనా ధోని కనీసం నాల్గో స్థానంలో బ్యాటింగ్ కు రావాలి. ఈ స్థానంలో ధోనికి గట్టి ప్రత్యర్థి యువీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఒకవేళ యువీ నాలుగో స్థానంలోవస్తే, ధోని ఐదో స్థానంలో వస్తాడు. కానిపక్షంలో ధోనిని కనీసం ఐదో స్థానంలోనైనా బ్యాటింగ్ కు పంపండి. అతని సహజసిద్ధమైన గేమ్ను స్వేచ్ఛగా ఆడే అవకాశాన్ని కల్పిస్తే భారత జట్టు లాభం చేకూరుతుంది.అంతేకానీ ధోనిని కిందిస్థానాల్లో బ్యాటింగ్ కు పంపి అతనిపై ఒత్తిడి తీసుకురాకండి' అని గంగూలీ తెలిపాడు.