జైపూర్: ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని డగౌట్ నుంచి ఫీల్డ్‌లోకి వెళ్లి మరీ నో బాల్ వివాదంపై అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇలా మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగడం ఎంతమాత్రం సరైనది కాదని రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ పేర్కొన్నాడు. ఒకసారి మైదానం విడిచి వెళ్లిపోయిన క్రికెటర్.. మళ్లీ పిచ్‌లోకి వచ్చి వివరణ కోరడం తన వరకూ అయితే కచ్చితంగా తప్పేనన్నాడు. ‘ ఆ సమయంలో నేను బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నా. అసలు ఏమి జరిగింది అనేది నాకు పూర్తిగా తెలియదు. అయినప‍్పటికీ డగౌట్ నుంచి ధోని వచ్చిఅంపైర్లను ప్రశ్నించడం సరైన చర్య కాదు. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. అందులో ధోని ఇలా ఫీల్డ్‌లోకి రావడం గేమ్‌లో మరింత వేడి పుట్టించింది. చివరకు మ్యాచ్‌ను చేజార్చుకోవడం నిరాశ కల్గించింది. గెలుస్తామనుకున్న మ్యాచ్‌లో పరాజయం వెక్కిరించింది. ఈ సీజన్‌లో వరుస పరాజయాలు చవిచూడటం మా జట్టును తీవ‍్ర నిరాశకు గురిచేస్తోంది’ అని బట్లర్ పేర్కొన్నాడు.
(ఇక్కడ చదవండి: మిస్టర్ కూల్ ధోనికి జరిమానా)
గురువారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై గెలుపు కోసం 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్ సాంట్నర్ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్ దీనిని తొలుత హైట్ నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్ అంపైర్ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్- స్ట్రైక్లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్ చేరాడు. అయితే మైదానంలోకి వెళ్లి అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ధోని ఐపీఎల్ నిబంధన 2.20 అతిక్రమించాడని అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.
(ఇక్కడ చదవండి: ‘అందుకే ధోని మైదానంలోకి వెళ్లాడు’)
Comments
Please login to add a commentAdd a comment