ధోని
బ్రిస్టల్ : ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని చెలరేగుతున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన ప్రతీ మ్యాచ్‌లో ఈ జార్ఖండ్ డైనమైట్ ఓ రికార్డును నెలకొల్పాడు. తొలి మ్యాచ్ అనంతరం అత్యధిక స్టంపింగ్‌లు సాధించిన వికెట్ కీపర్ నిలిచిన ధోని.. రెండో మ్యాచ్‌తో 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మూడో భారత క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు.
అయితే ఆదివారం జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో తన మార్క్ కీపింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 5 క్యాచ్‌లు పట్టి కొత్త రికార్డును నమోదు చేశాడు. దీంతో ఒక ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా ధోని నిలిచాడు. అంతేకాకుండా ఐదు ఔట్లలో భాగమైన అఫ్గాన్ వికెట్ కీపర్ షజాద్ రికార్డును ధోని సమం చేశాడు. అయితే అతను 3 క్యాచ్‌లు పట్టి 2 స్టంపింగ్‌లు చేశాడు. ఈ మ్యాచ్‌లోనే ధోని ఓ రనౌట్ కూడా చేశాడు. జాసన్ రాయ్, హేల్స్, మోర్గాన్, బెయిర్‌స్టో, ప్లంకెట్ క్యాచ్‌లు పట్టిన ధోని క్రిస్ జోర్డాన్‌ను రనౌట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీతో భారత్ 7 వికెట్ల తేడాతో నెగ్గి 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment