
ధోనికి ఐసీసీ షాక్
మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా ముస్తఫిజుర్‌కు 50 శాతం
మిర్పూర్: ‘కెప్టెన్ కూల్’ హాట్‌గా మారిన ఘటనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝళిపించింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢీకొట్టడంపై భారత కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 75 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించింది. భారత్ ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ధోని సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా ముస్తఫిజుర్ అతనికి అడ్డుగా వచ్చాడు. అయితే దీనిపై ఆగ్రహించిన ధోని, బౌలర్‌ను తన మోచేత్తో కుమ్మి మరీ పరుగు పూర్తి చేసుకున్నాడు.
ఆ దెబ్బకు ముస్తఫిజుర్ కొద్ది సేపు మైదానం కూడా వీడాల్సి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో ధోని ఉద్దేశపూర్వకంగానే ముస్తఫిజుర్‌ను తోసినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ విశ్వసించారు. ఈ క్రమంలో ఐసీసీ నియమావళిలోని లెవల్-2ను ఉల్లంఘించిన కారణంగా భారత కెప్టెన్‌కు ఈ జరిమానా పడింది. మరోవైపు పరుగు తీస్తున్న బ్యాట్స్‌మన్‌కు అడ్డు వచ్చిన కారణంగా బౌలర్‌నూ ఐసీసీ జరిమానాతో హెచ్చరించింది. యువ పేసర్ ముస్తఫిజుర్ మ్యాచ్ ఫీజులో కూడా 50 శాతం జరిమానా విధించింది.
వాదన వినిపించిన ధోని: శుక్రవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా మ్యాచ్ జరిగిన రాత్రి రిఫరీ పైక్రాఫ్ట్ భారత మేనేజర్ బిశ్వరూప్ డేకు నోటీసు పంపించారు. అయితే ధోని కావాలని ఢీకొట్టలేదని, ఆరోపణను సవాల్ చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ సమష్టి నిర్ణయం తీసుకుంది. ధోని, రవిశాస్త్రి, డే కలిసి తమ వాదన వినిపించారు. పరుగు పూర్తి చేయాలని ప్రయత్నించడమే తప్ప, ఆటగాడిని గాయపర్చే ఉద్దేశం లేదని వారు వివరణ ఇచ్చారు. అయితే ఏ రకంగా అయినా భౌతికంగా ఢీకొట్టడం లెవల్-2 ఉల్లంఘన కిందకు వస్తుందని రిఫరీ స్పష్టం చేశారు. అనంతరం ముస్తఫిజుర్‌ను కూడా విచారణకు పిలవగా, అతను తాను అడ్డుగా వచ్చి తప్పు చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతకుముందు రోహిత్‌కు కూడా బౌలర్ అదే విధంగా అడ్డు వచ్చాడు.
అనుభవజ్ఞుడు ఇలా చేస్తే ఎలా?: సీనియర్‌గా ధోని బాధ్యతను గుర్తు చేస్తూ రిఫరీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘బౌలర్ తప్పుడు దిశలో వచ్చాడని, ఇద్దరు ఢీకొనకుండా తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి పెద్ద ప్రమాదం జరగకుండా తన మోచేత్తో తోసేశానని ధోని వివరణ ఇచ్చాడు. అయితే నా పరిశీలన ప్రకారం భారత కెప్టెన్ కావాలనే చేసినట్లు కనిపిస్తోంది. పరుగు తీయడం ఇబ్బందిగా మారినా... ధోని అనుభవాన్ని బట్టి చూస్తే అతను బౌలర్‌ను ఢీకొనకుండా రన్ పూర్తి చేసి ఉండేవాడు. అందుకే 75 శాతం జరిమానా. తప్పు అంగీకరించిన ముస్తఫిజుర్‌కు 50 శాతం’ అని పైక్రాఫ్ట్ స్పష్టం చేశారు.
శాకాహారం కోసమేనట!
బంగ్లాదేశ్ పర్యటనలో తాము ఉంటున్న హోటల్ నుంచి ఇటీవల మరో హోటల్‌కు మార్చమని టీమిండియా కోరిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాలతో పాటు ఇతర ఏర్పాట్లు కష్టం కావడంతో జట్టును అదే హోటల్ (పాన్ పసిఫిక్) లోనే ఉండేట్లుగా బంగ్లా బోర్డు ఒప్పించింది. తమకు శాకాహారం అందుబాటులో లేకపోవడం వల్లే హోటల్ మార్పు గురించి భారత జట్టు సభ్యులు అడిగినట్లు తెలిసింది. అశ్విన్, ఇషాంత్, రైనాలు పూర్తిగా శాకాహారులు. తాము ఉంటున్న హోటల్‌లో అది లభించకపోగా... దగ్గరలో కూడా అలాంటి రెస్టారెంట్లు లేనట్లు తెలిసింది. పైగా అత్యంత రద్దీగా ఉండే సోనార్గావ్ ప్రాంతంలో ఆటగాళ్లు తిరగడం మరీ కష్టమైన విషయం. దాంతో విసుగు చెందిన ఈ ఆటగాళ్లు తాము ఉండలేమంటూ తేల్చి చెప్పారు. చివరకు బంగ్లా బోర్డు శాకాహారానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.