Mustafizur
-
బంగ్లాదేశ్‌ను గెలిపించిన ముస్తఫిజుర్
అబుదాబి: ఆసియా కప్‌లో మరో సూపర్ పోరులో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్లో విజయానికి 8 పరుగులు చేయాల్సిన అఫ్గానిస్తాన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసిన ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం భారత్‌తో జరిగే ఫైనల్లో తలపడుతుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇమ్రూల్ కైస్ (72; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (74; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడింది. ఇసానుల్లా (8), రహ్మత్ షా (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్తాన్‌ను ఓపెనర్ షహదత్ (53; 8 ఫోర్లు), హష్మతుల్లా (71; 5 ఫోర్లు) ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 63 పరుగులు జతచేశాక షహదత్ పెవిలియన్ చేరాడు. తర్వాత హష్మతుల్లాతో జోడీ కట్టిన కెప్టెన్ అస్గర్ (39; 2 ఫోర్లు) జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. అయితే జట్టు స్కోరు 167 పరుగుల వద్ద అస్గర్, 192 పరుగుల వద్ద హష్మతుల్లా నిష్క్రమించడంతో అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి. -
‘కత్తి’లాంటోడు..!
ఏడాది క్రితం అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు... క్రికెట్ ప్రపంచం అంతా అతడిని కీర్తిస్తోంది. ప్రత్యర్థి క్రికెటర్లు కొన్ని వందలసార్లు అతని బౌలింగ్ వీడియోలు చూస్తున్నారు. కానీ మైదానంలోకి దిగాక ఎవరికీ కొరుకుడు పడని బంతులు వేస్తున్నాడు. ఈ సీజన్ ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తున్న విరాట్ కోహ్లి కూడా అతని ధాటికి వెంటనే పెవిలియన్‌కు చేరాడు. ఆ సంచలనం పేరు ముస్తాఫిజుర్ రెహమాన్. బంగ్లాదేశ్‌కు చెందిన 20 ఏళ్ల ఈ యువ బౌలర్ ఇప్పుడు ఐపీఎల్ ద్వారా మరింత ప్రకంపనలు పుట్టిస్తున్నాడు. నిలకడగా బౌలింగ్ చేస్తూ సన్‌రైజర్స్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. సాక్షి క్రీడావిభాగం: గత జూన్‌లో భారత్‌తో వన్డే ద్వారా ముస్తాఫిజుర్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే తన ఆఫ్ కట్టర్స్‌తో బెంబేలెత్తించి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆ షాక్ నుంచి ధోనిసేన కోలుకునేలోగానే రెండో వన్డేలో ఆరు వికెట్లతో చెలరేగిపోయాడు. దీంతో తొలిసారి భారత్‌పై బంగ్లాదేశ్ వన్డే సిరీస్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్ హీరోగా మారిపోయాడు. అయితే ఇలాంటి బౌలర్లు గతంలో చాలామంది వచ్చారని, ముస్తాఫిజుర్ కూడా ఈ సంచలనాలు ఎక్కువ కాలం కొనసాగించలేడనే వాదన కూడా వినిపించింది. అయితే ఏడాది గడిచినా ప్రపంచంలోని టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా ఇప్పటికీ అతని ఆఫ్ కట్టర్స్‌ను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ ఏడాది కాలంలో మొత్తం 24 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను 52 వికెట్లు తీసుకున్నాడు. గత ఏడాది కాలంలో బంగ్లాదేశ్ సంచలన విజయాల్లో ముస్తాఫిజుర్దీ కీలకపాత్ర. చౌకగానే సన్‌రైజర్స్‌కు... ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ముస్తాఫిజుర్‌ను సన్‌రైజర్స్ జట్టు రూ.1.4 కోట్లు పెట్టి కొనుక్కుంది. నిజానికి అతని నైపుణ్యానికి ఇంతకంటే ఎక్కువ రేటు రావాల్సింది. కానీ ముస్తాఫిజుర్ ఇంకా ఈ స్థాయిలో రాణిస్తాడని ఏ జట్టూ ఊహించలేదు. ‘తన ఆఫ్ కట్టర్స్‌ను ఇంకా చాలామంది బ్యాట్స్‌మెన్ అర్థం చేసుకోలేదు. కాబట్టి కచ్చితంగా అతను మా బలమవుతాడు’ అని సన్‌రైజర్స్ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ వేలం సమయంలో అభిప్రాయపడ్డారు. ఒక రకంగా తను చౌకగానే ఈ జట్టుకు దొరికాడు. అయితే బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్‌తో పాటు ఆశిష్ నెహ్రా, బరీందర్ శరణ్లాంటి భారత ఎడమచేతి వాటం బౌలర్లు ఉన్నందున తుది జట్టులో ముస్తాఫిజుర్‌కు చోటు దక్కుతుందని అతను కూడా అనుకోలేదట. కానీ అనూహ్యంగా తొలి మ్యాచ్‌లోనే తుది జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్లో జోరు... సీజన్ తొలి మ్యాచ్‌లో బెంగళూరుతో మ్యాచ్‌లో సన్ బౌలర్లు 227 పరుగులు ఇచ్చారు. అయితే ముస్తాఫిజుర్ మాత్రం తన నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ నిలకడగా బంతులు వేస్తున్న అతను పంజాబ్‌పై నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్లు అవసరమైన సమయంలో... స్లాగ్ ఓవర్లలో కెప్టెన్ వార్నర్ బంతి ముస్తాఫిజుర్‌కు ఇస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ఫిజ్... 13 వికెట్లు తీసుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో అందరికంటే పొదుపుగా (6.15 ఎకానమీ) బౌలింగ్ చేశాడు. సుదీర్ఘకాలం ఉంటాడా? ఏడాది అంతర్జాతీయ క్రికెట్ అనుభవంలోనే ముస్తాఫిజుర్ రెండుసార్లు గాయాల బారిన పడ్డాడు. ఏ ఫాస్ట్ బౌలర్‌కైనా గాయాలు సహజం. ముస్తాఫిజుర్‌కు కూడా ఇప్పుడు తనని తాను గాయాల నుంచి కాపాడుకోవడమే కీలకం. చాలామంది బౌలర్లు గతంలో రెండు మూడేళ్లు సంచలన బౌలర్లుగా ప్రభావం చూపినా ఆ తర్వాత కనుమరుగయ్యారు. కారణం ప్రత్యర్థులు వారి బౌలింగ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడం. ఏ బౌలర్ అయినా ఎప్పటికప్పుడు మెరుగైతేనే సుదీర్ఘకాలం మనగలుగుతాడు. ముస్తాఫిజుర్లో ఈ నైపుణ్యం ఉందని సన్‌రైజర్స్ బౌలింగ్ మెంటార్ మురళీధరన్ అభిప్రాయపడుతున్నారు. ‘సరైన గెడైన్స్‌తో ప్రణాళికతో వెళితే ముస్తాఫిజుర్ సుదీర్ఘకాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడు’ అని ఆయన అన్నారు. భవిష్యత్ సంగతి ఎలా ఉన్నా ఈ సీజన్ ఐపీఎల్లో చివరి వరకూ ఇదే నిలకడ కనబరచి సన్‌రైజర్స్‌ను చాంపియన్‌గా నిలపాలని ఆశిద్దాం. స్ఫూర్తిదాయక నేపథ్యం బంగ్లాదేశ్‌లోని సత్కిరా అనే పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల పల్లెటూరు టెటూలియా ముస్తాఫిజుర్ స్వస్థలం. చిన్నప్పుడు తన ముగ్గురు అన్నలతో కలిసి సరదాగా టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడేవాడు. 12 ఏళ్ల వయసులో తనలో క్రికెట్ టాలెంట్‌ను గుర్తించిన అతని తండ్రి అబుల్ ఖాసీం ఘాజీ సత్కిరా పట్టణానికి శిక్షణ కోసం పంపించారు. దీనికోసం తన అన్న వెనుక బండి మీద కూర్చుని రోజూ 40 కిలోమీటర్లు వెళ్లి ప్రాక్టీస్ చేసేవాడు. దీంతో చదువు అటకెక్కింది. అయినా తనలో నైపుణ్యం ఉందని కోచ్‌లు చెప్పడంతో 2012లో ఢాకా వచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పేస్ బౌలింగ్ ఫౌండేషన్‌కు ఎంపికయ్యాడు. రెండేళ్లలోనే (2014) అండర్-19 ప్రపంచకప్‌కు ఎంపికయ్యాడు. 2014లో దేశవాళీ క్రికెట్లో నిలకడ, 2015 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఢాకా డైనమైట్స్ తరఫున 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీయడంతో జాతీయ జట్టులో అవకాశం లభించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ముస్తాఫిజుర్ అంచెలంచెలుగా ఎదిగిన వైనం బంగ్లాదేశ్‌లోని ఎందరో యువ క్రికెటర్లకు స్ఫూర్తి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ముస్తాఫిజుర్‌కు క్రేజ్ బాగా పెరిగింది. రోజూ వందల సంఖ్యలో లవ్‌లెటర్స్ వస్తున్నాయట. డిమాండ్ పెరిగింది...ప్రస్తుతం టి20 క్రికెట్లో సునీల్ నరైన్ తర్వాత అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన రికార్డు ముస్తాఫిజుర్ది. ఇప్పటికే అతను అనేక ఘనతలు సొంతం చే సుకున్నాడు. షకీబ్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో సంచలనంగా మారిన ముస్తాఫిజుర్ తమ లీగ్‌లలో ఆడాలని అన్ని దేశాలూ కోరుకుంటున్నాయి. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో లాహోర్ అతణ్ని తీసుకుంది. కానీ గాయం కారణంగా ఈ లీగ్‌లో అతను ఆడలేదు. ఐపీఎల్ తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో ససెక్స్ తరఫున ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ జట్లు కూడా ముస్తఫిజుర్‌తో చర్చలు జరుపుతున్నాయి. ఒకరకంగా ప్రస్తుతం అతను ప్రపంచ క్రికెట్లో హాట్ పేస్ బౌలర్. -
సఫారీలకు బంగ్లా షాక్
-
సఫారీలకు బంగ్లా షాక్
రెండో వన్డేలో విజయం ఢాకా : ఇటీవల నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్ దక్షిణాఫ్రికాకు కూడా షాక్ ఇచ్చింది. బౌలర్ల సమష్టి కృషికి తోడు ఓపెనర్ సౌమ్య సర్కార్ (79 బంతుల్లో 88 నాటౌట్; 13 ఫోర్లు; 1 సిక్స్) సూపర్ బ్యాటింగ్ కారణంగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన రెండో వన్డేలో బంగ్లా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ 46 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్‌కు డు ప్లెసిస్ (64 బంతుల్లో 41; 3 ఫోర్లు), బెహర్డీన్ (44 బంతుల్లో 36; 2 ఫోర్లు; 1 సిక్స్) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ముస్తఫిజుర్, నాసిర్ హొస్సేన్‌లకు మూడేసి వికెట్లు, రూబెల్కు రెండు వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ 27.4 ఓవర్లలోనే మూడు వికెట్లకు 167 పరుగులు చేసి గెలిచింది. తన తొలి రెండు ఓవర్లలో రెండు వికెట్లు తీసిన రబడా బంగ్లా శిబిరంలో ఆందోళన రేపినా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సౌమ్య, మహ్ముదుల్లా (64 బంతుల్లో 50; 6 ఫోర్లు) జోడి దీటుగా నిలబడింది. క్రీజులో ఆత్మవిశ్వాసంతో ఆడిన వీరు మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించి విజయాన్ని అందించారు. ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా బంగ్లాదేశ్ చాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించింది. -
'బెండు' తీస్తారు!
ఆస్ట్రేలియాలో వేసవి ఎండలో కోహ్లి పరుగుల వరద పారిస్తే తన ఫిట్‌నెస్‌కు ఆశ్చర్యపోయాం. ధోని తన మోచేత్తో తోసేస్తేనే బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ మైదానం వదిలి వెళ్లిపోతే... కెప్టెన్‌కు ఎంత బలమో అనుకున్నాం. ఈ ఫిట్నెస్ అంతా రాత్రికి రాత్రి రాదు. మ్యాచ్‌కు ముందు, తర్వాత... మ్యాచ్‌లు లేని సమయంలో జిమ్‌లో తీవ్రంగా కష్టపడాలి. ట్రెయినర్లు క్రికెటర్ల బెండు తీస్తారు. ‘మిగిలిన క్రీడలతో పోలిస్తే క్రికెటర్లకు పెద్దగా కష్టం ఉండదు... సరదాగా బ్యాటింగ్ చేస్తారు... మైదానంలో అలా నిలబడతారు’... ఈ వ్యాఖ్య చాలాసార్లు విన్నాం. కానీ క్రికెటర్లు కూడా ఫిట్నెస్ కోసం తీవ్రంగా శ్రమించాలి. మైదానం లో కంటే కూడా బయట ఎక్కువ కష్టపడాలి. అసలు భారత క్రికెటర్ల ఫిట్నెస్ ప్రణాళిక ఎలా ఉంటుంది? మన జట్టులో బాగా ఫిట్‌గా ఉండేదెవరు..? ఇలాంటి విషయాలు అందరికంటే బాగా చెప్పగలిగిన వ్యక్తి జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వీపీ సుదర్శన్. భారత జట్టు ఫిట్నెస్ వ్యవహారాల గురించిన విశేషాలు ఆయన మాటల్లోనే.... ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమం ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లతో నేను గతంలోనే ఎన్సీఏలో కలిసి పని చేశాను కాబట్టి వారి గురించి నాకు బాగా తెలుసు. పేర్లు చెప్పడం అనవసరం కానీ... కొంత మంది జిమ్‌లో చాలా ఉత్సాహంగా ఉంటే. మరికొందరు మైదానంలో చూసుకుందాంలే అనే టైపు! అలాగే అందరి శరీరాలు ఒకే రకంగా ఉండవు. దాంతో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ప్రత్యేక ప్రోగ్రాం తయారు చేసి నా పని ప్రారంభించాను. కొద్ది రోజులకు ఆట మాత్రమే కాదు మంచి క్రికెటర్ కావడంలో ఫిట్నెస్ ప్రాధాన్యత ఏమిటో కూడా వారు గుర్తించారు. ఇప్పుడు మాత్రం అందరూ ఒక స్థాయి ఫిట్‌నెస్‌కు చేరుకున్నారు. మీకు మన మ్యాచ్‌లలో అది కనిపిస్తుంది కూడా! కండలు అవసరం లేదు భారత క్రికెటర్లు బాగానే ఉంటారు కానీ దేహదారుఢ్యం, శక్తి, వేగం విషయంలో వారు తమ స్థాయిని పెంచుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మజిల్స్ సైజ్ కాదు అవి ఎంత చురుగ్గా పని చేస్తాయనేది ముఖ్యం. ఆ ప్రమాణాల ప్రకారం భారత ఆటగాళ్లు బాగా ఉన్నట్లే. టెస్టు మ్యాచ్‌లాంటిది అయితే రోజంతా మైదానంలో గంటల కొద్దీ నిలబడటం, బ్యాటింగ్‌లో క్రీజ్‌లో పాతుకుపోవడం లేదా ఎక్కువ సంఖ్యలో ఓవర్లు వేయాల్సి వస్తే వారికి సాధారణ ఫిట్నెస్ సరిపోదు. కండలు పెంచడం, బలంగా ఉండటం రెండు వేర్వేరు. కండలు పెంచితే వారు బాడీబిల్డర్లు అవుతారు గానీ క్రికెటర్లు కాదు! మైదానంలో చాలా చురుగ్గా పరుగెత్తాల్సి ఉంటుంది కాబట్టి ‘కటౌట్’ ఉంటే సరిపోదు. మ్యాచ్‌లు లేని సమయంలో కనీసం ఆరు వారాల కఠోర శ్రమతో మన క్రికెటర్లను మ్యాచ్‌కు ఫిట్ చేయవచ్చు. ఎవరెవరు ఎలా... జట్టులో ధోని, ధావన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్‌లకు చక్కటి ఫిట్నెస్ సహజంగా వచ్చింది. వీరి అథ్లెటిక్ లక్షణాలు అసాధారణం. రహానే, జడేజా, బిన్నీలాంటి వాళ్లు కూడా బాగానే ఉంటారు కానీ దానిని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఉదాసీనతకు తావిస్తే వెనకపడిపోతారు. అయితే పుజారా, అక్షర్ పటేల్‌లాంటి వాళ్లు అయితే ఇన్నేళ్లు కేవలం ఆటపైనే దృష్టి పెట్టినట్లున్నారు. వారు ఎదిగే క్రమంలో అసలు ఎవరూ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించమని చెప్పలేనట్లుంది! వీళ్ల కోసం ప్రత్యేకమైన శిక్షణా పద్ధతులే కాదు అందరి కంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ పేరుకు పేస్ బౌల ర్ అయినా చూడ్డానికి ఎలా ఉంటాడో మీకు తెలుసు. ఇతని విషయంలో కండలు పెంచడంకంటే ఫంక్షనల్ ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకేసారి కండరాలపై ఒత్తిడి పెంచకుండా జాయింట్స్‌పై దృష్టి పెడతాం. ఇక నా దృష్టిలో గతంతో పోలిస్తే ఇటీవల ఫిట్‌నెస్‌లో బాగా మెరుగైన ఆటగాడు అశ్విన్. ధోని, కోహ్లిల ఫిట్నెస్ కచ్చితంగా అందరికంటే ధోని ప్రత్యేకం. అతనిది ‘సహజమైన ఫ్రేమ్’. దేవుడిచ్చిన కానుక అంటాను. తన శరీరం గురించి ధోనికి చాలా బాగా తెలుసు. శరీరంలో ఏ కండరం ఎలా స్పందిస్తుందో, ఎంత కండలు పెంచవచ్చో అతను సరిగ్గా చెప్పగలడు. విరామం సమయంలో జిమ్‌లో గంటల కొద్దీ గడపడు. మ్యాచ్‌కు నాలుగైదు రోజుల ముందు మాత్రమే రావడాన్ని అతను ఇష్టపడతాడు. అందుకే అందరిలాంటి ఎక్సర్సైజ్లు ధోనికి పని చేయవు. అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. కోహ్లి అయితే తన కోసం కొన్ని ప్రమాణాలు పెట్టుకొని అదే లక్ష్యంగా కష్టపడతాడు. ముఖ్యంగా తాను ‘ఇలా ఉండాలంటే ఎలా చేయాలి’ అని స్పష్టంగా అడిగి మరీ అదే పనిలో పడతాడు. అందుకే అతను ఇప్పుడు అంత ఫిట్‌గా తయారయ్యాడు. భారత ఆటగాళ్లు అంత ఫిట్‌గా ఉండరనే అపప్రథ తప్పని ఈ తరం క్రికెటర్లు నిరూపిస్తున్నారు. -
'ముస్తాఫిజుర్ ను కిడ్నాప్ చేయం'
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరగనున్న చివరి వన్డేలో గెలవడమే తమ ముందున్న సవాలు అని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. గత రెండు వన్డేల్లో తాము సమిష్టిగా విఫలమయ్యాయని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పాడు. షేర్-ఈ- బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రాక్టీసు సందర్భంగా అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్ ఓడిపోవడం అవమానంగా భావించడం లేదన్నాడు. బాగా ఆడిన బంగ్లాదేశ్ సిరీస్ సొంతం చేసుకోవడం సమంజసమే అన్నాడు. టీమిండియా బ్యాట్స్ మన్ ను వణికిస్తున్న బంగ్లా కొత్త బౌలర్ ముస్తాఫిజుర్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ఎటువంటి వ్యూహం అమలు చేయబోతున్నారని ప్రశ్నించగా... 'అతడిని మేము కిడ్నాప్ చేయం' అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. ముస్తాఫిజుర్ నిజంగా మంచి బౌలర్ అని, అతడిని తాము గౌరవిస్తామని చెప్పాడు. చివరి వన్డేలో గెలిచి 'బంగ్లావాష్' తప్పించుకుంటామన్న విశ్వాసాన్ని ఆశ్విన్ వ్యక్తం చేశాడు. -
ధోనికి ఐసీసీ షాక్
మ్యాచ్ ఫీజులో 75 శాతం జరిమానా ముస్తఫిజుర్‌కు 50 శాతం మిర్పూర్: ‘కెప్టెన్ కూల్’ హాట్‌గా మారిన ఘటనలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొరడా ఝళిపించింది. తొలి వన్డేలో బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్‌ను ఢీకొట్టడంపై భారత కెప్టెన్ ధోని మ్యాచ్ ఫీజులో 75 శాతం మొత్తాన్ని జరిమానాగా విధించింది. భారత్ ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ధోని సింగిల్ తీసేందుకు ప్రయత్నించగా ముస్తఫిజుర్ అతనికి అడ్డుగా వచ్చాడు. అయితే దీనిపై ఆగ్రహించిన ధోని, బౌలర్‌ను తన మోచేత్తో కుమ్మి మరీ పరుగు పూర్తి చేసుకున్నాడు. ఆ దెబ్బకు ముస్తఫిజుర్ కొద్ది సేపు మైదానం కూడా వీడాల్సి వచ్చింది. ఘటన జరిగిన సమయంలో ధోని ఉద్దేశపూర్వకంగానే ముస్తఫిజుర్‌ను తోసినట్లు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ విశ్వసించారు. ఈ క్రమంలో ఐసీసీ నియమావళిలోని లెవల్-2ను ఉల్లంఘించిన కారణంగా భారత కెప్టెన్‌కు ఈ జరిమానా పడింది. మరోవైపు పరుగు తీస్తున్న బ్యాట్స్‌మన్‌కు అడ్డు వచ్చిన కారణంగా బౌలర్‌నూ ఐసీసీ జరిమానాతో హెచ్చరించింది. యువ పేసర్ ముస్తఫిజుర్ మ్యాచ్ ఫీజులో కూడా 50 శాతం జరిమానా విధించింది. వాదన వినిపించిన ధోని: శుక్రవారం జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా మ్యాచ్ జరిగిన రాత్రి రిఫరీ పైక్రాఫ్ట్ భారత మేనేజర్ బిశ్వరూప్ డేకు నోటీసు పంపించారు. అయితే ధోని కావాలని ఢీకొట్టలేదని, ఆరోపణను సవాల్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ సమష్టి నిర్ణయం తీసుకుంది. ధోని, రవిశాస్త్రి, డే కలిసి తమ వాదన వినిపించారు. పరుగు పూర్తి చేయాలని ప్రయత్నించడమే తప్ప, ఆటగాడిని గాయపర్చే ఉద్దేశం లేదని వారు వివరణ ఇచ్చారు. అయితే ఏ రకంగా అయినా భౌతికంగా ఢీకొట్టడం లెవల్-2 ఉల్లంఘన కిందకు వస్తుందని రిఫరీ స్పష్టం చేశారు. అనంతరం ముస్తఫిజుర్‌ను కూడా విచారణకు పిలవగా, అతను తాను అడ్డుగా వచ్చి తప్పు చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. అంతకుముందు రోహిత్‌కు కూడా బౌలర్ అదే విధంగా అడ్డు వచ్చాడు. అనుభవజ్ఞుడు ఇలా చేస్తే ఎలా?: సీనియర్‌గా ధోని బాధ్యతను గుర్తు చేస్తూ రిఫరీ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ‘బౌలర్ తప్పుడు దిశలో వచ్చాడని, ఇద్దరు ఢీకొనకుండా తప్పించుకునే అవకాశం లేదు కాబట్టి పెద్ద ప్రమాదం జరగకుండా తన మోచేత్తో తోసేశానని ధోని వివరణ ఇచ్చాడు. అయితే నా పరిశీలన ప్రకారం భారత కెప్టెన్ కావాలనే చేసినట్లు కనిపిస్తోంది. పరుగు తీయడం ఇబ్బందిగా మారినా... ధోని అనుభవాన్ని బట్టి చూస్తే అతను బౌలర్‌ను ఢీకొనకుండా రన్ పూర్తి చేసి ఉండేవాడు. అందుకే 75 శాతం జరిమానా. తప్పు అంగీకరించిన ముస్తఫిజుర్‌కు 50 శాతం’ అని పైక్రాఫ్ట్ స్పష్టం చేశారు. శాకాహారం కోసమేనట! బంగ్లాదేశ్ పర్యటనలో తాము ఉంటున్న హోటల్ నుంచి ఇటీవల మరో హోటల్‌కు మార్చమని టీమిండియా కోరిన సంగతి తెలిసిందే. అయితే భద్రతా కారణాలతో పాటు ఇతర ఏర్పాట్లు కష్టం కావడంతో జట్టును అదే హోటల్ (పాన్ పసిఫిక్) లోనే ఉండేట్లుగా బంగ్లా బోర్డు ఒప్పించింది. తమకు శాకాహారం అందుబాటులో లేకపోవడం వల్లే హోటల్ మార్పు గురించి భారత జట్టు సభ్యులు అడిగినట్లు తెలిసింది. అశ్విన్, ఇషాంత్, రైనాలు పూర్తిగా శాకాహారులు. తాము ఉంటున్న హోటల్లో అది లభించకపోగా... దగ్గరలో కూడా అలాంటి రెస్టారెంట్లు లేనట్లు తెలిసింది. పైగా అత్యంత రద్దీగా ఉండే సోనార్గావ్ ప్రాంతంలో ఆటగాళ్లు తిరగడం మరీ కష్టమైన విషయం. దాంతో విసుగు చెందిన ఈ ఆటగాళ్లు తాము ఉండలేమంటూ తేల్చి చెప్పారు. చివరకు బంగ్లా బోర్డు శాకాహారానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.