
'ముస్తాఫిజుర్ ను కిడ్నాప్ చేయం'
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరగనున్న చివరి వన్డేలో గెలవడమే తమ ముందున్న సవాలు అని టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అన్నాడు. గత రెండు వన్డేల్లో తాము సమిష్టిగా విఫలమయ్యాయని, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పాడు. షేర్-ఈ- బంగ్లా నేషనల్ స్టేడియంలో ప్రాక్టీసు సందర్భంగా అశ్విన్ మీడియాతో మాట్లాడాడు. సిరీస్ ఓడిపోవడం అవమానంగా భావించడం లేదన్నాడు. బాగా ఆడిన బంగ్లాదేశ్ సిరీస్ సొంతం చేసుకోవడం సమంజసమే అన్నాడు.
టీమిండియా బ్యాట్స్ మన్ ను వణికిస్తున్న బంగ్లా కొత్త బౌలర్ ముస్తాఫిజుర్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ఎటువంటి వ్యూహం అమలు చేయబోతున్నారని ప్రశ్నించగా... 'అతడిని మేము కిడ్నాప్ చేయం' అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. ముస్తాఫిజుర్ నిజంగా మంచి బౌలర్ అని, అతడిని తాము గౌరవిస్తామని చెప్పాడు. చివరి వన్డేలో గెలిచి 'బంగ్లావాష్' తప్పించుకుంటామన్న విశ్వాసాన్ని ఆశ్విన్ వ్యక్తం చేశాడు.