![Bangladesh beat Afghanistan by three runs - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/24/asia.jpg.webp?itok=cKU2fNH4)
అబుదాబి: ఆసియా కప్‌లో మరో సూపర్ పోరులో బంగ్లాదేశ్ 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్‌లో విజయానికి 8 పరుగులు చేయాల్సిన అఫ్గానిస్తాన్ నాలుగు పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసిన ముస్తఫిజుర్ బంగ్లాదేశ్ విజయాన్ని ఖాయం చేశాడు. బుధవారం పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు శుక్రవారం భారత్‌తో జరిగే ఫైనల్లో తలపడుతుంది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఇమ్రూల్ కైస్ (72; 6 ఫోర్లు), మహ్ముదుల్లా (74; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 126 పరుగులు జోడించారు. దీంతో బంగ్లా ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 246 పరుగులు చేసి ఓడింది.
ఇసానుల్లా (8), రహ్మత్ షా (1) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన అఫ్గానిస్తాన్‌ను ఓపెనర్ షహదత్ (53; 8 ఫోర్లు), హష్మతుల్లా (71; 5 ఫోర్లు) ఆదుకున్నారు. మూడో వికెట్‌కు 63 పరుగులు జతచేశాక షహదత్ పెవిలియన్ చేరాడు. తర్వాత హష్మతుల్లాతో జోడీ కట్టిన కెప్టెన్ అస్గర్ (39; 2 ఫోర్లు) జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. అయితే జట్టు స్కోరు 167 పరుగుల వద్ద అస్గర్, 192 పరుగుల వద్ద హష్మతుల్లా నిష్క్రమించడంతో అఫ్గాన్ ఆశలు ఆవిరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment