టి20 ప్రపంచకప్ సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్
తొలిసారి ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్‌కు
చివరి మ్యాచ్‌లో 8 పరుగులతో బంగ్లాదేశ్‌పై విజయం
గెలిపించిన రషీద్, నవీన్, గుర్బాజ్
గురువారం దక్షిణాఫ్రికాతో సెమీస్ పోరు
కన్నీళ్లు ఆగడం లేదు... భావోద్వేగాలను నియంత్రించుకోవడం సాధ్యం కావడం లేదు... పట్టరాని ఆనందాన్ని ప్రదర్శించేందుకు పదాలు దొరకడం లేదు... ఒకరు కాదు, ఇద్దరు కాదు అందరి ఆటగాళ్లది ఇదే పరిస్థితి... తాము సాధించిన ఘనత ఎంత అసాధారణమైనదో వారికి తెలుస్తున్నా ఇంకా నమ్మశక్యంగా అనిపించని స్థితి... సొంత దేశంలో క్రికెట్ మైదానంలో అడుగు పెట్టడమే కష్టంగా మారిపోగా... జట్టు సభ్యులంతా కలిసి సాధన చేసే అవకాశం లేకపోగా... ఎప్పుడో టోర్నీకి ముందు కలిసి ప్రాక్టీస్ చేయడమే... కానీ తమ పోరాటం, పట్టుదల ముందు వాటన్నంటినీ చిన్న విషయాలుగా మార్చేసింది. అగ్రశ్రేణి జట్లు క్రికెట్‌ను శాసిస్తున్న చోట అంచనాలు లేకుండా బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ అసాధారణ ఆటను చూపించింది... అద్భుత ఆటతో సత్తా చాటుతూ ప్రపంచకప్ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది.
టోర్నీకి ముందు అంచనాలు లేవు... అండర్‌డాగ్ కిందే లెక్క.. కానీ లీగ్ దశలో న్యూజిలాండ్‌పై భారీ విజయం గాలివాటం కాదని, సూపర్–8లో ఆ్రస్టేలియాను చిత్తు చేసిన వైనం అదృష్టం వల్ల కాదని అఫ్గానిస్తాన్ నిరూపించింది... గత టి20 వరల్డ్‌కప్‌లో ఒక్క విజయానికి కూడా నోచుకోని జట్టు ఇప్పుడు ఏకంగా సెమీస్ చేరింది. బంగ్లాదేశ్‌తో చివరి సూపర్–8 పోరులో విజయం దోబూచులాడింది.
115 పరుగులు మాత్రమే చేసి దానిని కాపాడుకోవడం అంత సులువు కాదు. కానీ అఫ్గాన్ ఆటగాళ్లంతా ప్రాణాలు పణంగా పెట్టినట్లు మైదానంలో పోరాడారు... మళ్లీ మళ్లీ పలకరిస్తూ వచ్చిన వర్షంతో కూడా పోటీ పడాల్సి వచ్చి0ది... చివరకు తాము అనుకున్నది సాధించారు. బంగ్లాపై పైచేయి సాధించి తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సగర్వంగా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకోగా, తాము ఎప్పటికీ మారమన్నట్లుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు నిష్క్రమించారు.
కింగ్స్‌టౌన్ (సెయింట్ విన్సెంట్): ‘కమాన్ బంగ్లాదేశ్’... భారత్‌తో ఓటమి తర్వాత ఆ్రస్టేలియా కెప్టెన్ మిచెల్ మార్‡్ష మాట ఇది. ఆల్‌టైమ్ గ్రేట్ జట్టు కూడా మరో టీమ్ ప్రదర్శనను నమ్ముకుంటూ అదృష్టం పలకరిస్తుందేమోనని ఆశపడింది. బంగ్లాదేశ్ గెలిస్తే తాము సెమీఫైనల్ చేరవచ్చని కంగారూలు కలగన్నారు. కానీ అఫ్గానిస్తాన్ ఆ అవకాశం ఇవ్వలేదు. మంగళవారం జరిగిన గ్రూప్–1 చివరి సూపర్–8 మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 8 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం జరిగే తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాతో అఫ్గాన్ టీమ్... రాత్రి జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ తలపడతాయి.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేయగలిగింది. రహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. బంగ్లాదేశ్ స్పిన్నర్ రిషాద్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షం రావడంతో ఒక ఓవర్ తగ్గించి లక్ష్యాన్ని 19 ఓవర్లలో 114 పరుగులుగా నిర్దేశించారు. అయితే బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది.
లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా కాగా... జట్టులో నలుగురు డకౌటయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవీన్ ఉల్ హక్ (4/26), కెపె్టన్ రషీద్ ఖాన్ (4/23) ప్రత్యర్థిని దెబ్బ కొట్టారు. తాజా ఫలితంతో గ్రూప్–1 నుంచి 2 విజయాలతో 4 పాయింట్లు సాధించిన అఫ్గానిస్తాన్ రెండో స్థానంతో సెమీస్ చేరింది. బంగ్లాదేశ్ ఓటమితో ఆస్ట్రేలియా జట్టు కూడా ‘సూపర్–8’ దశలోనే ఇంటిదారి పట్టింది.
ఆద్యంతం ‘డ్రామా’ సాగి...
స్వల్ప స్కోర్ల ఈ మ్యాచ్ పలు మలుపులతో ఆసక్తికరంగా సాగింది. పదే పదే వాన అంతరాయం కలిగించడంతో విజయం దోబూచులాడింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ మినహా అంతా విఫలమయ్యారు. అతను కూడా తన శైలికి భిన్నంగా చాలా నెమ్మదిగా ఆడాడు. చివర్లో రషీద్ ఖాన్ (10 బంతుల్లో 19 నాటౌట్; 3 సిక్స్‌లు) మెరుపులతో స్కోరు 100 పరుగులు దాటింది. రన్‌రేట్‌లో అఫ్గాన్, ఆసీస్‌లను దాటి సెమీస్ చేరాలంటే 12.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించాల్సిన స్థితిలో బంగ్లాదేశ్ మైదానంలోకి దిగింది.
అయితే సెమీస్ సంగతేమో కానీ ఆ జట్టు మ్యాచ్ గెలిచే అన్ని అవకాశాలను కూడా వృథా చేసుకుంది. ఫజల్ తన తొలి ఓవర్లోనే తన్జీద్ (0)ను అవుట్ చేయగా, నవీన్ వరుస బంతుల్లో నజు్మల్ (5), షకీబ్ (0)లను అవుట్ చేయడంతో స్కోరు 23/3 వద్ద నిలిచింది. ఈ దశలో వాన వచ్చి ఆగిన తర్వాత రషీద్ వరుస ఓవర్లలో సౌమ్య సర్కార్ (10), తౌహీద్ (14)లను వెనక్కి పంపించాడు. అయినా సరే చేతిలో 5 వికెట్లతో 56 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన బంగ్లాదేశ్ గెలిచే స్థితిలో నిలిచింది.
కానీ రషీద్ మళ్లీ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నాడు. 81/7 నుంచి బంగ్లా డక్‌వర్త్ లూయిస్ స్కోరుతో పోటీ పడుతూ వచ్చింది. ఒక ఎండ్‌లో నిలిచిన దాస్ ఎంతో ప్రయత్నించినా... మరోవైపు మిగిలిన మూడు వికెట్లు తీసేందుకు అఫ్గాన్ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ముస్తఫిజుర్‌ను నవీన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో అఫ్గాన్ ఆటగాళ్లు, అభిమానుల సంబరాలతో మైదానం హోరెత్తిపోగా... అక్కడి నుంచి దాదాపు 12 వేల కిలోమీటర్ల దూరంలో కాబూల్‌లో కూడా ఆ విజయధ్వానం బ్రహ్మాండంగా వినిపించింది!
ఉత్తమ నటుడు గుల్బదిన్!
11.4 ఓవర్ల తర్వాత బంగ్లా స్కోరు 81/7 వద్ద వానతో మ్యాచ్ ఆగినప్పుడు ఒక ఆసక్తికర ఘటన జరిగింది. డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఆ సమయానికి బంగ్లా 2 పరుగులు వెనుకబడి ఉంది. అక్కడే మ్యాచ్ ముగిసిపోతే అఫ్గాన్ గెలుస్తుంది. ఈ దశలో పరిస్థితి మెరుగ్గా ఉంది, తొందరపడ వద్దన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ నుంచి అఫ్గాన్ కోచ్ జొనాథన్ ట్రాట్ సైగ చేశాడు. అప్పటి వరకు స్లిప్‌లో చక్కగా ఫీల్డింగ్ చేస్తున్న గుల్బదిన్ ‘అలా అయితే ఓకే’ అన్నట్లుగా ఒక్కసారిగా కండరాలు పట్టేశాయంటూ కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే పిచ్‌పై కవర్లు వచ్చేశాయి.
అయితే ఆ తర్వాత మళ్లీ చక్కగా మైదానంలోకి దిగిన గుల్బదిన్ తర్వాతి వికెట్ కూడా తీశాడు. దాంతో ఇదంతా నటన అంటూ అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రషీద్ మాత్రం తన ఆటగాడికి మద్దతుగా నిలిచాడు. నిజానికి అక్కడే మ్యాచ్ ముగిసి ఉంటే వివాదం జరిగేదేమో కానీ ఆట కొనసాగి ఆలౌట్ వరకు వెళ్లడంతో ఇది సమస్యగా మారలేదు.
‘వెల్‌డన్’
అంతర్జాతీయ క్రికెట్‌లో అఫ్గానిస్తాన్ ప్రస్థానం అసాధారణం
అగ్రశ్రేణి జట్లకు దీటుగా ఎదిగిన వైనం
‘మిమ్మల్ని నిరాశపర్చము, మీ నమ్మకాన్ని నిలబెడతాం’... టి20 వరల్డ్‌కప్ ప్రారంభానికి ముందు జరిగిన వెల్‌కమ్ పార్టీలో క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాతో రషీద్ ఖాన్ అన్న మాట ఇది. ఎందుకంటే ఈ టోర్నీలో సెమీస్ చేరే నాలుగు జట్ల పేర్లు చెప్పమని మాజీలు, విశ్లేషకులతో అడిగితే ఒక్క లారా మాత్రమే అఫ్గానిస్తాన్ పేరు చెప్పాడు. వారి ఆటపై అతనికి ఉన్న నమ్మకాన్ని ఇది చూపించింది.
రేపు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలోనే రషీద్ బృందం సెమీఫైనల్ మ్యాచ్ ఆడబోతోంది! గత కొన్నేళ్లుగా అటు వన్డే, ఇటు టి20 ఫార్మాట్‌లలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన అఫ్గానిస్తాన్ ఇప్పుడు ‘సంచలనాల’ జట్టు నుంచి సమర్థమైన జట్టుగా ఎదిగింది. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కేంద్రంగానే తమ హోం మ్యాచ్‌లు ఆడుతోంది.
ఆటగాళ్లంతా కూడా అక్కడే దాదాపుగా స్థిరపడ్డారు. 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనే అఫ్గానిస్తాన్ పదును ఏమిటో ప్రపంచానికి తెలిసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, పాకిస్తాన్‌లను ఓడించిన టీమ్, ఆ్రస్టేలియాను కూడా ఒకదశలో 91/7తో ఓటమి దిశగా నెట్టింది. ఆసీస్ అదృష్టవశాత్తూ మ్యాక్స్‌వెల్ అద్భుత ఇన్నింగ్స్ జట్టును గెలిపించినా... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్ లో నాటి పనిని అఫ్గాన్ పూర్తి చేసింది. –సాక్షి క్రీడా విభాగం
10 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రపంచకప్ (వన్డే/టి20) టోర్నీల చరిత్రలో సెమీఫైనల్ దశకు చేరిన పదో జట్టుగా అఫ్గానిస్తాన్ గుర్తింపు పొందింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా (1975), ఇంగ్లండ్ (1975), న్యూజిలాండ్ (1975), వెస్టిండీస్ (1975), పాకిస్తాన్ (1979), భారత్ (1983), దక్షిణాఫ్రికా (1992), శ్రీలంక (1996), కెన్యా (2003) జట్లు ఉన్నాయి.
1 ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్తాన్ తొలిసారి విజయం అందుకుంది. గతంలో బంగ్లాదేశ్‌తో జరిగిన నాలుగు ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో (టి20; 2014లో...వన్డే వరల్డ్‌కప్; 2015, 2019, 2023) అఫ్గానిస్తాన్ ఓడిపోయింది.
9 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌లో నాలుగు అంతకన్నా ఎక్కువ వికెట్లు తీయడం రషీద్ ఖాన్‌కిది తొమ్మిదిసారి. షకీబ్ అల్ హసన్ (8 సార్లు) పేరిట ఉన్న రికార్డును రషీద్ బద్దలు కొట్టాడు.
న్యూజిలాండ్, ఆ్రస్టేలియావంటి జట్లను ఓడించి సెమీస్ వరకు సాగిన మీ ప్రయాణం అద్భుతం. మీ శ్రమకు, పట్టుదలకు
ఫలితమే ఈ విజయం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా. దీనిని ఇలాగే కొనసాగించండి. – సచిన్ టెండూల్కర్
మైదానంలో దృశ్యాలు చాలా గొప్పగా కనిపిస్తున్నాయి. అఫ్గాన్‌కు గొప్ప విజయమిది. తొలిసారి సెమీస్ చేరిన పఠాన్లలో భావోద్వేగాలు బలంగా కనిపిస్తున్నాయి. అత్యుత్తమ క్రికెట్ ప్రదర్శన ఇది. –యువరాజ్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment