
'బెండు' తీస్తారు!
ఆస్ట్రేలియాలో వేసవి ఎండలో కోహ్లి పరుగుల వరద పారిస్తే తన ఫిట్‌నెస్‌కు ఆశ్చర్యపోయాం. ధోని తన మోచేత్తో తోసేస్తేనే బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ మైదానం వదిలి వెళ్లిపోతే... కెప్టెన్‌కు ఎంత బలమో అనుకున్నాం. ఈ ఫిట్‌నెస్ అంతా రాత్రికి రాత్రి రాదు. మ్యాచ్‌కు ముందు, తర్వాత... మ్యాచ్‌లు లేని సమయంలో జిమ్‌లో తీవ్రంగా కష్టపడాలి. ట్రెయినర్లు క్రికెటర్ల బెండు తీస్తారు.
‘మిగిలిన క్రీడలతో పోలిస్తే క్రికెటర్లకు పెద్దగా కష్టం ఉండదు... సరదాగా బ్యాటింగ్ చేస్తారు... మైదానంలో అలా నిలబడతారు’... ఈ వ్యాఖ్య చాలాసార్లు విన్నాం. కానీ క్రికెటర్లు కూడా ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమించాలి. మైదానం లో కంటే కూడా బయట ఎక్కువ కష్టపడాలి. అసలు భారత క్రికెటర్ల ఫిట్‌నెస్ ప్రణాళిక ఎలా ఉంటుంది? మన జట్టులో బాగా ఫిట్‌గా ఉండేదెవరు..? ఇలాంటి విషయాలు అందరికంటే బాగా చెప్పగలిగిన వ్యక్తి జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ వీపీ సుదర్శన్. భారత జట్టు ఫిట్‌నెస్ వ్యవహారాల గురించిన విశేషాలు ఆయన మాటల్లోనే....
ఒక్కొక్కరికి ఒక్కో కార్యక్రమం
ప్రస్తుత భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లతో నేను గతంలోనే ఎన్‌సీఏలో కలిసి పని చేశాను కాబట్టి వారి గురించి నాకు బాగా తెలుసు. పేర్లు చెప్పడం అనవసరం కానీ... కొంత మంది జిమ్‌లో చాలా ఉత్సాహంగా ఉంటే. మరికొందరు మైదానంలో చూసుకుందాంలే అనే టైపు! అలాగే అందరి శరీరాలు ఒకే రకంగా ఉండవు. దాంతో ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ప్రత్యేక ప్రోగ్రాం తయారు చేసి నా పని ప్రారంభించాను. కొద్ది రోజులకు ఆట మాత్రమే కాదు మంచి క్రికెటర్ కావడంలో ఫిట్‌నెస్ ప్రాధాన్యత ఏమిటో కూడా వారు గుర్తించారు. ఇప్పుడు మాత్రం అందరూ ఒక స్థాయి ఫిట్‌నెస్‌కు చేరుకున్నారు. మీకు మన మ్యాచ్‌లలో అది కనిపిస్తుంది కూడా!
కండలు అవసరం లేదు
భారత క్రికెటర్లు బాగానే ఉంటారు కానీ దేహదారుఢ్యం, శక్తి, వేగం విషయంలో వారు తమ స్థాయిని పెంచుకునేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మజిల్స్ సైజ్ కాదు అవి ఎంత చురుగ్గా పని చేస్తాయనేది ముఖ్యం. ఆ ప్రమాణాల ప్రకారం భారత ఆటగాళ్లు బాగా ఉన్నట్లే. టెస్టు మ్యాచ్‌లాంటిది అయితే రోజంతా మైదానంలో గంటల కొద్దీ నిలబడటం, బ్యాటింగ్‌లో క్రీజ్‌లో పాతుకుపోవడం లేదా ఎక్కువ సంఖ్యలో ఓవర్లు వేయాల్సి వస్తే వారికి సాధారణ ఫిట్‌నెస్ సరిపోదు. కండలు పెంచడం, బలంగా ఉండటం రెండు వేర్వేరు. కండలు పెంచితే వారు బాడీబిల్డర్లు అవుతారు గానీ క్రికెటర్లు కాదు! మైదానంలో చాలా చురుగ్గా పరుగెత్తాల్సి ఉంటుంది కాబట్టి ‘కటౌట్’ ఉంటే సరిపోదు. మ్యాచ్‌లు లేని సమయంలో కనీసం ఆరు వారాల కఠోర శ్రమతో మన క్రికెటర్లను మ్యాచ్‌కు ఫిట్ చేయవచ్చు.
ఎవరెవరు ఎలా...
జట్టులో ధోని, ధావన్, ఉమేశ్ యాదవ్, వరుణ్ ఆరోన్‌లకు చక్కటి ఫిట్‌నెస్ సహజంగా వచ్చింది. వీరి అథ్లెటిక్ లక్షణాలు అసాధారణం. రహానే, జడేజా, బిన్నీలాంటి వాళ్లు కూడా బాగానే ఉంటారు కానీ దానిని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమించాల్సి ఉంటుంది. ఉదాసీనతకు తావిస్తే వెనకపడిపోతారు. అయితే పుజారా, అక్షర్ పటేల్‌లాంటి వాళ్లు అయితే ఇన్నేళ్లు కేవలం ఆటపైనే దృష్టి పెట్టినట్లున్నారు. వారు ఎదిగే క్రమంలో అసలు ఎవరూ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపించమని చెప్పలేనట్లుంది!
వీళ్ల కోసం ప్రత్యేకమైన శిక్షణా పద్ధతులే కాదు అందరి కంటే ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ పేరుకు పేస్ బౌల ర్ అయినా చూడ్డానికి ఎలా ఉంటాడో మీకు తెలుసు. ఇతని విషయంలో కండలు పెంచడంకంటే ఫంక్షనల్ ట్రైనింగ్ ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఒకేసారి కండరాలపై ఒత్తిడి పెంచకుండా జాయింట్స్‌పై దృష్టి పెడతాం. ఇక నా దృష్టిలో గతంతో పోలిస్తే ఇటీవల ఫిట్‌నెస్‌లో బాగా మెరుగైన ఆటగాడు అశ్విన్.
ధోని, కోహ్లిల ఫిట్‌నెస్
కచ్చితంగా అందరికంటే ధోని ప్రత్యేకం. అతనిది ‘సహజమైన ఫ్రేమ్’. దేవుడిచ్చిన కానుక అంటాను. తన శరీరం గురించి ధోనికి చాలా బాగా తెలుసు. శరీరంలో ఏ కండరం ఎలా స్పందిస్తుందో, ఎంత కండలు పెంచవచ్చో అతను సరిగ్గా చెప్పగలడు. విరామం సమయంలో జిమ్‌లో గంటల కొద్దీ గడపడు. మ్యాచ్‌కు నాలుగైదు రోజుల ముందు మాత్రమే రావడాన్ని అతను ఇష్టపడతాడు. అందుకే అందరిలాంటి ఎక్సర్‌సైజ్‌లు ధోనికి పని చేయవు.
అతనితో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. కోహ్లి అయితే తన కోసం కొన్ని ప్రమాణాలు పెట్టుకొని అదే లక్ష్యంగా కష్టపడతాడు. ముఖ్యంగా తాను ‘ఇలా ఉండాలంటే ఎలా చేయాలి’ అని స్పష్టంగా అడిగి మరీ అదే పనిలో పడతాడు. అందుకే అతను ఇప్పుడు అంత ఫిట్‌గా తయారయ్యాడు. భారత ఆటగాళ్లు అంత ఫిట్‌గా ఉండరనే అపప్రథ తప్పని ఈ తరం క్రికెటర్లు నిరూపిస్తున్నారు.