జహీర్ 'దిగి' వస్తాడా?
న్యూఢిల్లీ: గతేడాది భారత ప్రధాన కోచ్ గా అనిల్ కుంబ్లే బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఏడాది కాలానికి భారత జట్టుకు కుంబ్లేను కోచ్ గా నియమించింది బీసీసీఐ. అయితే అదే సమయంలో జట్టుకు బౌలింగ్ కోచ్ కూడా ఉండే బాగుంటుందని బీసీసీఐ భావించింది. దానిలో భాగంగానే కుంబ్లేను ప్రధాన కోచ్ గా ఎంపిక చేసిన తరువాత జహీర్ ఖాన్ ను బౌలింగ్ కోచ్ చేయమంటూ బీసీసీఐ ప్రతిపాదన పంపింది. కాగా, జహీర్ నుంచి బీసీసీఐకు దిమ్మే తిరిగే సమాధానం అందిందట.
తాను కేవలం పార్ట్ టైమ్ కోచ్ గా మాత్రమే చేస్తానని చెప్పిన జహీర్.. అందుకు నాలుగు కోట్లు రూపాయిలు డిమాండ్ చేశాడట. 100 రోజుల పాటు బౌలింగ్ కోచ్ గా ఉండేందుకు నాలుగు కోట్లు డిమాండ్ చేశాడు. ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ దరఖాస్తుల్నిఆహ్వానించిన నేపథ్యంలో కుంబ్లేకు ఎటువంటి పొడిగింపు లేదనేది అర్ధమవుతోంది. అదే క్రమంలో భారత జట్టు బౌలింగ్ కోచ్ గురించి మరొకసారి ప్రస్తావన వచ్చింది. ఇటీవల కుంబ్లే, విరాట్ కోహ్లిలు జహీర్ ను బౌలింగ్ గా నియమించాలంటూ ప్రతిపాదించిన నేపథ్యంలో అతను గతంలో ఎంత డబ్బు డిమాండ్ చేశాడో అనే విషయం మరొకసారి తెరపైకి వచ్చింది. ఒకవేళ జహీర్ ను బౌలింగ్ కోచ్ గా చేయడానికి ఒప్పుకుంటే ఈసారి ఎంత డబ్బులు డిమాండ్ చేస్తాడో మరి. ఫుల్ టైమ్ కోచ్ గా పని చేయాలంటే ఇంకెంత భారీగా అడుగుతాడో తెలియక అని బీసీసీఐ తర్జన భర్జన పడుతుంది.. అసలు జహీర్ ను ఎంపిక చేసేందుకు ముందుకు వెళదామా? వద్దా?అనే యోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారు. మరొకవైపు ప్రధాన కోచ్ ను ఎంపిక చేసిన తరువాత మాత్రమే జహీర్ గురించి ఆలోచిస్తే మంచిదని బోర్డు అభిప్రాయంగా ఉంది.