ఢాకా: తాను బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి వైదొలగడానికి సీనియర్ క్రికెటర్లతో విభేదాలు ఎంతమాత్రం కారణం కాదని జింబాబ్వే మాజీ ఆటగాడు రిచర్డ్ హల్‌సాల్ తాజాగా స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్ పదవికి గత నెల్లో రిచర్డ్ హల్‌సాల్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. శ్రీలంకతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో బంగ్లాదేశ్ ఘోర వైఫల్యం అనంతరం రిచర్డ్ హల్‌సాల్ ఉన్నపళంగా పదవి నుంచి తప్పుకున్నాడు.
అయితే బంగ్లాదేశ్ సీనియర్ క్రికెటర్లతో విభేదాలతోనే జట్టు అసిస్టెంట్ కోచ్ పదవికి హల్‌సాల్ వీడ్కోలు చెప్పినట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి. దీనిపై సోమవారం బీసీబీ కార్యాలయానికి హాజరైన హల్‌సాల్ మాట్లాడుతూ..‘ సీనియర్ క్రికెటర్లతో సఖ్యత లేదని వార్తల్లో నిజం లేదు. సీనియర్ ఆటగాళ్ల అభిప్రాయం అనేది జట్టుకు ఎప్పుడూ అవసరమే. వారి నుంచి చాలా సందర్భాల్లో సలహాలు స్వీకరించా. వారితో ఎప్పుడూ నాకు అభిప్రాయ భేదాలు రాలేదు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతోనే అసిస్టెంట్ కోచ్ పదవి నుంచి వైదొలిగా’ అని రిచర్డ్ హల్‌సాల్ వివరణ ఇచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment