ఢిల్లీ వీర్‌కు ఊరట | Dilli complete league stage on winning note | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వీర్‌కు ఊరట

Published Thu, Dec 24 2015 1:16 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 PM

Dilli complete league stage on winning note

బెంగళూరు: ఆలస్యంగానైనా తేరుకున్న ఢిల్లీ వీర్ జట్టు ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో ఎట్టకేలకు ఓ విజయాన్ని తమ ఖాతాలో జమచేసుకుంది. బెంగళూరు యోధాస్‌తో బుధవారం జరిగిన తమ చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ వీర్ 4-3తో గెలిచి ఊరట చెందింది. నిర్ణాయక ఏడో బౌట్‌లో నవ్‌రుజోవ్ ఇఖ్తియార్ (ఢిల్లీ వీర్) 10-1 పాయింట్ల తేడాతో బజరంగ్ పూనియా (బెంగళూరు)ను ఓడించి తమ జట్టుకు ఏకైక విజయం దక్కడంలో ముఖ్యపాత్ర పోషించాడు.
 
 అంతకుముందు పురుషుల 57 కేజీల విభాగంలో బెఖ్‌బాయెర్ (ఢిల్లీ వీర్) 7-0తో సందీప్ తోమర్‌పై, 125 కేజీల విభాగంలో దావిత్ (బెంగళూరు) 10-0తో కృషన్‌పై, 74 కేజీల విభాగంలో నర్సింగ్ యాదవ్ (బెంగళూరు) 8-4తో దినేశ్ కుమార్‌పై గెలిచారు. మహిళల 53 కేజీల బౌట్‌లో లిలియా హోరిష్నా (ఢిల్లీ వీర్) 11-6తో లలితా షెరావత్‌పై, 58 కేజీల బౌట్‌లో యులియా (బెంగళూరు) 3-1తో ఎలిఫ్ జాలెపై, 48 కేజీల బౌట్‌లో వినేశ్ ఫోగట్ (ఢిల్లీ వీర్) 10-0తో అలీసా లాంపెపై విజయం సాధించారు.
 
 ఆరు జట్ల మధ్య జరుగుతోన్న ఈ లీగ్‌లో ఇప్పటికే పంజాబ్ రాయల్స్, హరియాణా హ్యామర్స్, ముంబై గరుడ, బెంగళూరు యోధాస్ సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. గురువారం జరిగే చివరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో ముంబై గరుడతో హరియాణా హ్యామర్స్ తలపడుతుంది.  25, 26 తేదీల్లో సెమీస్ జరుగుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement