బీసీసీఐ అధికారులందరినీ తొలగించండి
న్యూఢిల్లీ: లోధా ప్యానల్ సిఫారసులను అమలు చేయకుండా జాప్యం చేస్తున్న భారత క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీసీసీఐ పదవుల్లో ఉన్నవారందరనీ తొలగించాలని లోధా ప్యానల్ తాజాగా సిఫారసు చేసింది. సోమవారం సుప్రీం కోర్టుకు ఈ కమిటీ మరో నివేదిక సమర్పించింది. బీసీసీఐ పరిపాలన వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి జీకే పిళ్లైను నియమించాలని సూచించింది.
ఐపీఎల్‌లో బెట్టింగ్ కుంభకోణం వెలుగుచూసిన అనంతరం బీసీసీఐని ప్రక్షాళన చేయడానికి సుప్రీం కోర్టు లోధా కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. క్రికెట్ బోర్డులో చేయాల్సిన మార్పుల గురించి గతంలో ఈ కమిటీ సుప్రీం కోర్టుకు ఓ నివేదిక సమర్పించింది. అయితే లోధా సిఫారసులన్నింటినీ అమలు చేయడం సాధ్యంకాదని బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయగా, కొంత గడువు కావాలని బోర్డు కోరింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో లోధా కమిటీ తాజాగా మరో నివేదిక కోర్టుకు సమర్పించింది. బీసీసీఐ అధికారులందరినీ తొలగించడంతో పాటు బోర్డు కీలక కాంట్రాక్టులను పరిశీలించేందుకు పిళ్లైను నియమించాలని కోరింది.