లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి మద్దతుగా నిలిచాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. ధోని రిటైర్మెంట్‌కు సంబంధించి పదే పదే వ్యాఖ్యలు చేయడం అంత మంచిది కాదని సూచించాడు. ఇలా వ్యాఖ్యలు చేసి అతని ఆలోచనలను రిటైర్మెంట్ దిశగా నడిపించాలని అనుకుంటున్నారా అని హుస్సేన్ ప్రశ్నించారు. కొన్ని రోజుల క్రితం ధోని రిటైర్మెంట్ అంశానికి సంబంధించి టీమిండియా ప్రధాన కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి మాట్లాడుతూ.. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా ధోని రీఎంట్రీ ఆధారపడుతుందనే సంకేతాలిచ్చాడు. (ధోని కాదు..మరి ఊతప్ప ఫేవరెట్ కెప్టెన్ ఎవరు?)
ఇదే విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన హుస్సేన్.. ధోని రిటైర్మెంట్ అనే అంశమే మాట్లాడకపోవడం మంచిదన్నాడు. ధోనికి అతని సత్తా ఏమిటో తెలుసని, ఎవరు కూడా వీడ్కోలు విషయం చెప్పనవసరం లేదన్నాడు. ఒకవేళ పదే పదే ధోని రిటైర్మెంట్‌పై చర్చ పెడితే మాత్రం అది కచ్చితంగా అతన్ని ఆ ఆలోచన దిశగా నడిపించినట్లేనన్నాడు. ధోని లాంటి క్రికెటర్లు తరానికి ఒకసారి మాత్రమే వస్తారనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఏమైనా ఊహించని ఒత్తిడి వల్ల ధోని రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని మళ్లీ తీసుకురాగలరా అంటూ నిలదీశాడు. ధోనిలో ఇంకా చాలా టాలెంట్ ఉందనే విషయం తెలుసుకోవాలన్నాడు. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై వైఫల్యంతో ధోని ఆటను నిర్దారించలేమన్నాడు. ధోనిని బలవంతంగా రిటైర్మెంటు దిశగా నడిపించే వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హుస్సేన్ స్పష్టం చేశాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)తో తన రీఎంట్రీ ఘనంగా ఉండాలని ఆశించిన ధోనికి నిరాశే ఎదురైంది. తన ఐపీఎల్ ప్రాక్టీస్‌ను నెలముందుగానే మొదలు పెట్టేసినా ఆ లీగ్ జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. కరోనా వైరస్ కారణంగా మార్చి 29వ తేదీ ఆరంభం కావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15వ తేదీ వరకూ వాయిదా పడింది. ఇప్పటికీ కరోనా నివారణంలో ఎటువంటి పురోగతి లేకపోవడంతో వాయిదా పడిన సమయానికి ఐపీఎల్ నిర్వహణ అనేది అసాధ్యం. అన్ని అనుకూలిస్తే పూర్తిస్థాయి ఐపీఎల్ నిర్వహణయకు రెండు-మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment