
స్మిత్ డబుల్ సెంచరీ
దుబాయ్: చాలా కాలం తర్వాత దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ (227 బ్యాటింగ్) టెస్టుల్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. డివిలియర్స్ (157 బ్యాటింగ్)తో కలిసి పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించింది.
గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 134 ఓవర్లలో 4 వికెట్లకు 460 పరుగులు చేసింది. పాక్‌ను 99 పరుగులకే ఆలౌట్ చేసిన సఫారీ జట్టు... ప్రస్తుతం 361 పరుగుల ఆధిక్యంలో ఉంది. 128/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ప్రొటీస్ ఆరంభంలోనే నైట్‌వాచ్‌మన్ స్టెయిన్ (7) వికెట్‌ను కోల్పోయింది. అయితే స్మిత్, డివిలియర్స్... పాక్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. లంచ్‌కు ముందు 204 బంతుల్లో 27వ సెంచరీ పూర్తి చేసుకున్న కెప్టెన్ ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. రెండో ఎండ్‌లో డివిలియర్స్ చక్కని సహకారం అందించడంతో పరుగుల వరద పారింది. ఈ క్రమంలో డివిలియర్స్ కూడా 152 బంతుల్లో కెరీర్‌లో 17వ శతకాన్ని పూర్తి చేశాడు. ఆట చివర్లో స్మిత్ మరింత వేగంగా ఆడి డబుల్ సెంచరీ సాధించాడు. ఇదే క్రమంలో టెస్టుల్లో 9 వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన 12వ క్రికెటర్ స్మిత్. దక్షిణాఫ్రికా తరఫున రెండో ఆటగాడు.