పాము రక్తం తాగుతూ..!
విజేందర్‌తో పోరుకు ప్రత్యర్థి సన్నద్ధం
మాంచెస్టర్: గత మూడు బౌట్‌లలో ప్రత్యర్థిని నాకౌట్ చేసిన భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్‌ను ఎలాగైనా ఓడించాలని అనుకున్నాడో ఏమోగాని... ఈసారి అతని ప్రత్యర్థి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నాడు. కేవలం ప్రాక్టీస్‌తో ఫలితం లేదనుకున్నాడెమో... శారీరకంగా ఇంకా పటిష్టం కావాలనే ఉద్దేశంతో విజేందర్ తాజా ప్రత్యర్థి అలెగ్జాండర్ హోర్వాత్ (హం గేరి) తన ఆహార జాబితాలో పాము రక్తాన్ని కూడా చేర్చుకున్నాడు. ఈనెల 12న లివర్‌పూల్‌లో విజేందర్, హోర్వాత్‌ల మధ్య బౌట్ జరగనుంది. విజేందర్ ఇప్పటివరకు మూడు బౌట్‌లలో పోటీపడగా మూడింటిలోనూ నాకౌట్ విజయాలు సాధించాడు. మరోవైపు 20 ఏళ్ల హోర్వాత్ ఏడు బౌట్‌లలో పాల్గొని ఐదింటిలో గెలిచాడు. ఒక బౌట్‌లో ఓడిపోయి, మరో బౌట్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.
‘తాజా పాము రక్తాన్ని తాగడం మా కుటుంబంలో చాలా ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. నేను నిజమైన యోధుడిని. ఒకప్పుడు యుద్ధంలో ప్రత్యర్థులను ఓడించేందుకు హంగేరి సైనికులు పాము రక్తాన్ని తాగేవారు. విజేందర్‌ను ఓడించేందుకు నేను ఇలా చేస్తున్నాను. పాము రక్తంతో మాటల్లో చెప్పలేనివిధంగా శక్తిమంతుడిని అవుతాను’ అని హోర్వాత్ అన్నాడు.