
ఫైనల్లో దక్షిణాఫ్రికా
డు ప్లెసిస్ మరో సెంచరీ
హరారే: ముక్కోణపు వన్డే టోర్నీలో దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 63 పరుగుల తేడాతో జింబాబ్వేపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఫాఫ్ డు ప్లెసిస్ (140 బంతుల్లో 121; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించడం విశేషం. ఓవరాల్‌గా ఒకే వన్డే టోర్నీలో మూడు శతకాలు సాధించిన ఏడో ఆటగాడిగా డు ప్లెసిస్ నిలిచాడు. జేపీ డుమిని (62 బంతుల్లో 51; 3 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు.
అనంతరం జింబాబ్వే 47.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌటైంది. ఫైనల్‌కు చేరాలంటే 25.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించాల్సిన జింబాబ్వే ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. బ్రెండన్ టేలర్ (96 బంతుల్లో 79; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. శనివారం ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి.