డివిలియర్స్, మోర్కెల్లకు ఉద్వాసన
జోహన్నెస్ బర్గ్: న్యూజీలాండ్ తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్కు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ దూరం కానున్నాడు. దీంతో కెప్టెన్సీ పగ్గాలను టీ20 కెప్టెన్ డుప్లెసిస్ కు అప్పగించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది. కివీస్ తో టెస్టు సిరీస్ నుంచి డివిలియర్స్, ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ లకు సఫారీ క్రికెట్ బోర్డు ఉద్వాసన పలికింది. ఫాస్ట్ బౌలర్ డెల్ స్టెయిన్, వెర్నర్ ఫిలాండర్, ఆల్ రౌండర్ వేన్ పార్నెల్ 15 మంది జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నెల 19న డర్బన్ లో తొలి టెస్టు ప్రారంభంకానుంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో గాయపడ్డ డివిలియర్స్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడని అందుకే కివీస్ టూర్ కు ఎంపిక చేయలేదు. మరోవైపు మోర్నీ మోర్కెల్ వెన్నునొప్పితో సతమతమవుతున్నాడని, అతడికి 4 నుంచి 6 వారాలపాటు విశ్రాంతి కావాలని బోర్డు తెలిపింది. 2004లో టెస్టు అరంగేట్రం చేసినప్పటి నుంచీ గాయాల కారణంగా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా మిస్సవ్వని డివిలియర్స్ ప్రస్తుత సిరీస్ కు దూరం కానున్నాడు. గత ఇంగ్లండ్ సిరీస్ మధ్యలోనే హషీం ఆమ్లా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో డివిలియర్స్ ను టెస్టు కెప్టెన్గా నియమించిన విషయం తెలిసిందే.