
దులీప్ ట్రోఫీకి మంగళం
భారత దేశవాళీ క్రికెట్‌లో ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఫస్ట్‌క్లాస్ జోనల్ టోర్నీ దులీప్ ట్రోఫీని బీసీసీఐ రద్దు చేసింది...
టోర్నీని రద్దు చేసిన బీసీసీఐ
- దేవధర్, విజయ్ హజారే, ముస్తాక్ అలీ టోర్నీ ఫార్మాట్‌లో మార్పులు
న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్‌లో ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఫస్ట్‌క్లాస్ జోనల్ టోర్నీ దులీప్ ట్రోఫీని బీసీసీఐ రద్దు చేసింది. 2015-16 సీజన్‌లో ఈ టోర్నీని నిర్వహించరాదని నిర్ణయించింది. తర్వాతి సీజన్‌లో దీనిని మళ్లీ పునరుద్ధరిస్తారా లేక శాశ్వతంగా రద్దు చేశారా అనేదానిపై బోర్డు స్పష్టత ఇవ్వలేదు. అనిల్ కుంబ్లే నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు తాజా సీజన్‌ను పలు మార్పులతో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, కోచ్‌ల విజ్ఞప్తి మేరకు దేశవాళీ టి20 టోర్నీ ముస్తాక్ అలీ ట్రోఫీని సరిగ్గా ఐపీఎల్ వేలంకు ముందు నిర్వహించనున్నారు. అక్టోబర్ 1న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లతో ప్రారంభమయ్యే 2015-16 భారత దేశవాళీ సీజన్ మార్చి 10న ఇరానీ కప్‌తో ముగుస్తుంది.
రంజీ తరహాలో వన్డేలు...
ఇప్పటి వరకు వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ఐదు జోన్లలో ముందుగా నిర్వహించి అక్కడ ముందంజ వేసిన జట్లతో నాకౌట్ పోటీలు జరిపేవారు. అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలాగే మొత్తం 27 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించి టోర్నీని జరుపుతారు. టి20ల్లోనూ జోనల్ పద్ధతిని పక్కన పెట్టి సరిగ్గా ఇదే విధంగా ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిం ది. మరోవైపు జోనల్ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీని కూ డా ఐదు జోన్లుగా కాకుండా మూడు జట్లతో నిర్వహిస్తారు. ఇందులో విజయ్ హజారే ట్రోఫీ విజేత ఒక జట్టుగా ఉంటుంది. మిగిలిన రెండు జట్లను సెలక్టర్లు ఎంపిక చేస్తారు.
కొత్త టోర్నీలకు సిద్ధం...
ఈ సీజన్ నుంచి బోర్డు కొత్తగా అండర్-19 స్థాయిలో చాలెంజర్ ట్రోఫీని నిర్వహించనుంది. ఇందులో ప్రదర్శన కనబర్చిన జూనియర్ ఆటగాళ్లు వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌లో జరిగే అండర్-19 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. మహిళల క్రికెట్‌లో కూడా ఈసారి కొత్తగా మరో రెండు టోర్నీలకు బోర్డు శ్రీకారం చుట్టింది. ఇంటర్ స్టేట్-ఇంటర్ జోనల్ అండర్-23 టోర్నీతో పాటు మూడు రోజుల సీనియర్ ఇంటర్ జోనల్ టోర్నీని కూడా తొలిసారి ప్రవేశపెట్టారు.