చాంపియన్: సీక్రెట్ ఆఫ్ విండీస్ ఎనర్జీ
వికెట్ పడితే చాంపియన్ డాన్స్.. మ్యాచ్ గెలిస్తే గ్రూప్ గా చాంపియన్ డాన్స్.. డ్రెస్సింగ్ రూమ్ లోనూ చాంపియన్ డాన్స్.. వాళ్ల డాన్సులు చూసి చూసి ప్రత్యర్థి జట్లు కూడా చాంపియన్ డాన్స్ చేయడం మొదలుపెట్టాయి. కోల్ కతాలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో విండీస్ వికెట్లు పడగొట్టినప్పుడల్లా ఇంగ్లీష్ బౌలర్లు చాంపియన్ డాన్స్ చేయడం గుర్తేకదా! ఇక భారత మహిళల క్రికెట్ జట్టు చాంపియన్ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తోంది. అసలేమిటీ చాంపియన్ డాన్స్?
ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన గంగ్నమ్ డ్యాన్స్ సృష్టికర్త పేరు ఠక్కున చెప్పగలరా? పోనీ, దాన్ని పాపులర్ చేసింది ఎవరు? మొదటి ప్రశ్నకు సమాధానం చాలామందికి తెలియకపోవచ్చు. తెలిసినవాళ్లు కూడా వెంటనే చెప్పలేకపోవచ్చు. అదే రెండో ప్రశ్నకు మాత్రం ముక్తకంఠంతో చెప్పే సమాధానం 'క్రిస్ గేల్ అండ్ వెస్టిండీస్ క్రికెట్ టీమ్' అని. తమది కాకపోయినా గంగ్నమ్ డ్యాన్స్ ను పాపులరైజ్ చేయటంలో ముఖ్యభూమిక పోషించిన విండీస్ ఆటగాళ్లు.. ఇక తమలో ఒకడైన బ్రావో రూపొందించిన 'చాంపియన్' పాట విషయంలో ఊరికే ఉండగలరా!
విండీస్ ప్లేయర్ డీజె బ్రావో సంగీతకారుడు కూడా అన్న సంగతి తెలిసిందే. 'చాంపియన్' పేరుతో తాను రూపొందించిన ఓ వీడియో సాంగ్ ను వరల్డ్ కప్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు (మార్చిలో) రిలీజ్ చేశాడు బ్రావో. యూట్యూబ్ లోనూ పోస్ట్ చేశాడు. మొదట్లో అంతగా హిట్స్ రాలేదు. పాటలోని అంతరార్థం విండీస్ ఆటగాళ్లకు ఫుల్ ఎనర్జీ ఇచ్చింది. దీంతో టీ20 వరల్డ్ కప్ లో విండీస్ ఒక్కో మ్యాచ్ విజయం సాధిస్తూ పోవడం, మ్యాచ్ గెలవగానే ఆటగాళ్లందరూ చేతులు ముందుకూ వెనక్కి ఊపుతూ చాంపియన్ డాన్స్ చేయడం పలువురిని ఆకట్టుకుంది. అప్పటి నుంచి చాంపియన్ సాంగ్ కోసం నెట్ లో వేట ముమ్మరమైంది.
ఇక ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్స్ లో విజేతగా నిలిచిన విండీస్ దాదాపు గంటన్నరపాటు ఈ పాటకు స్టెప్పులేస్తూ గ్రౌండ్ మొత్తం కలియదిరగటం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ తర్వాతైతే చాంపియన్ వీడియో వైరల్ అయిపోయింది. ఇప్పటికే లక్షకుపైగా హిట్స్ తో దూసుకుపోతోందాపాట. కరీబియన్లందరూ చాంపియన్లు అందరూ చాపియన్లేనని, గేల్, లారా, వీవీ రిచర్డ్స్, మాల్కం మార్షల్ వంటి విండీస్ క్రికెటర్లు, అమెరికా నల్లజాతి అథ్లెట్లు ఉస్సేన్ బోల్ట్, మైఖెల్ జోర్డాన్, సెరీనా విలియమ్స్ తోపాటు ఇప్పటి, ఒకప్పటి దేశాధినేతలు బరాక్ ఒబామా, నెల్సన్ మండేలాలు కూడా చాంపియన్లే అంటూ సాగుతుందా పాట. వరల్డ్ కప్ లో విండీస్ గెలుపుకేకాక నల్లజాతీయులందరిలోనూ ఉత్సాహాన్ని నింపుతోన్న ఆ పాట మీకోసం..