చాంపియన్ ఈస్ట్‌జోన్
సాక్షి, హైదరాబాద్: ఎన్‌సీఏ అండర్–16 ఇంటర్ జోనల్ రెండు రోజుల క్రికెట్ టోర్నమెంట్‌లో ఈస్ట్‌జోన్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. సెంట్రల్ జోన్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్ 88 పరుగుల తేడాతో గెలుపొంది టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లాడిన ఈస్ట్‌జోన్ మూడింట్లో నెగ్గి ఆరు పాయింట్లను సాధించింది. సెంట్రల్ జోన్ జట్టు కూడా ఆరు పాయింట్లతో నిలిచినప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా ఈస్ట్‌జోన్ విజేతగా నిలిచింది.
ఆదివారం ప్రారంభమైన చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఈస్ట్‌జోన్ 90 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసింది. శయన్ కుమార్ (79), ప్రయాస్ బర్మన్ (84) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం సెంట్రల్ జోన్ జట్టు 81.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఈస్ట్‌జోన్ బౌలర్లలో టి. సుశాంత్ మిశ్రా, కరణ్ లాల్ చెరో 3 వికెట్లు తీశారు.
చివరి స్థానంలో సౌత్‌జోన్
టోర్నీ ఆరంభం నుంచి ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయిన సౌత్‌జోన్ జట్టు పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానాన్ని దక్కించుకుంది. చివరి మ్యాచ్‌లోనూ వెస్ట్‌జోన్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓడిపోయి వరుసగా నాలుగు పరాజయాలతో టోర్నీని ముగించింది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ జట్టు 30.2 ఓవర్లలో 94 పరుగులకే కుప్పకూలింది. అనంతరం వెస్ట్‌జోన్ జట్టు 20.3 ఓవర్లలో 2 వికెట్లకు 99 పరుగులు చేసి గెలిచింది. ప్రజ్ఞేశ్ (53 నాటౌట్) ఆకట్టుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత క్రికెటర్ అంబటి రాయుడు, హెచ్‌సీఏ కార్యదర్శి టి. శేష్ నారాయణ్ పాల్గొని నార్త్‌జోన్ జట్టుకు ట్రోఫీని బహూకరించారు.