సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నీలో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ ఇల్యాన్ సథాని (129 బంతుల్లో 103; 18 ఫోర్లు, ఒక సిక్స్) సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో ఈసీఐఎల్ గ్రౌండ్‌లో కర్ణాటకతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఓ మోస్తరు స్కోరును సాధించగలిగింది. 222/9 ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 101.3 ఓవర్లలో 257 పరుగులకు ఆలౌటైంది. 82 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట రెండోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇల్యాన్, శ్రాగ్వి (15 నాటౌట్)తో కలిసి పదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కర్ణాటక బౌలర్లలో కుషాల్ గౌడ 4 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కర్ణాటక జట్టు ఆటముగిసే సమయానికి 77 ఓవర్లలో 7 వికెట్లకు 271 పరుగులతో నిలిచింది. అక్షణ్ రావు (182 బంతుల్లో 103; 14 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా, స్మరణ్ (132 బంతుల్లో 76; 14 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో టి. రోహన్, శ్రాగ్వి చెరో 2 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం కర్ణాటక 14 పరుగుల ఆధిక్యంలో ఉంది. నేడు ఆటకు చివరిరోజు.
ఆంధ్ర 353/9 డిక్లేర్డ్
ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో కేరళతో జరుగుతోన్న మరో మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు భారీస్కోరు సాధించింది. 144/1 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర జట్టు 85 ఓవర్లలో 9 వికెట్లకు 353 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆంధ్రకు 215 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. కె. నితీశ్ కుమార్ రెడ్డి (69; 12 ఫోర్లు), ఎం. సూర్యకిరణ్ (65; 5 ఫోర్లు), పి. సుబ్రమణ్యం (62; 5 ఫోర్లు), ధరణి కుమార్ (66; 10 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కేరళ బౌలర్లలో కిరణ్ సాగర్, శ్రీనాథ్, రెహాన్ సాయి తలా 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేరళ జట్టు ఆటముగిసే సమయానికి 30 ఓవర్లలో 5 వికెట్లకు 71 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్లలో వాసు 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 138 పరుగులు చేసిన కేరళ... ఇంకా 144 పరుగులు వెనకబడి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment