8 టోర్నీలు టైటిల్స్ | eight tournments Titles | Sakshi
Sakshi News home page

8 టోర్నీలు టైటిల్స్

Published Mon, Jan 6 2014 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

8 టోర్నీలు టైటిల్స్

8 టోర్నీలు టైటిల్స్

ఒకప్పుడు భారత క్రికెట్ జట్టులోకి ఎంపిక కావాలంటే రంజీ ట్రోఫీలో వరుస సీజన్లలో టన్నుల కొద్దీ పరుగులు సాధిస్తేనే సెలక్టర్ల దృష్టి ఆ ఆటగాడిపై పడేది. దేశవాళీ జట్లపైనే తప్ప ఇతర దేశాల ప్రత్యర్థులతో తలపడే అవకాశాలు కూడా అరుదుగానే దక్కేవి. అయితే ఇప్పుడు అండర్-19 క్రికెట్‌తో పాటు ఈ స్థాయిలో టోర్నీల సంఖ్య కూడా పెరగడంతో మరింత మంది కుర్రాళ్లు తమ సత్తాను ప్రదర్శించేందుకు చక్కటి వేదిక లభించింది.
 
  దానిని వారు సమర్థంగా ఉపయోగించుకుంటూ సీనియర్ల వెనకే తాము సిద్ధంగా ఉన్నామని ఆటతో చాటి చెబుతున్నారు. భవిష్యత్తులో దేశానికి మరిన్ని విజయాలు సాధించగలమంటూ భరోసా కల్పిస్తున్నారు.
 
 (సాక్షి క్రీడా విభాగం)
 దాదాపు ఏడాదిన్నర క్రితం ప్రపంచకప్ విజేత... ఆ తర్వాత ఆస్ట్రేలియాలో నాలుగు దేశాల టోర్నీలో గెలుపు, శ్రీలంకలో వన్డే సిరీస్ కైవసం... కొన్నాళ్ల క్రితం వైజాగ్‌లో నాలుగు దేశాల టోర్నీలో టైటిల్... ఇప్పుడు ఆసియా కప్ ట్రోఫీ... అండర్-19 స్థాయిలో భారత యువ జట్టు ఎదురులేకుండా దూసుకుపోతోంది. 2011 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు భారత జట్టు ఆడిన 8 వన్డే అంతర్జాతీయ టోర్నీలలో విజేతగా నిలవడం విశేషం.
 
 అంతకు ముందు కూడా ప్రపంచ కప్ స్థాయి విజయాలున్నా... ఇంత నిలకడగా ఆడుతుండటం ఇటీవల మన యువ జట్టు ఘనతకు నిదర్శనం. ముఖ్యంగా ఇందులో చాలా మంది ఆటగాళ్లు అండర్-19 స్థాయికే పరిమితం కాకుండా ఆ తర్వాత దేశవాళీలో తమ రాష్ట్ర జట్లు, ఐపీఎల్‌లోనూ రాణిస్తూ వ్యక్తిగతంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
 
 ఆకట్టుకున్నారు...
 ఆసియా కప్ విజయంలో జట్టులో ప్రతీ ఒక్కరు తమ వంతు బాధ్యతను చక్కగా నిర్వర్తించారు. ఓపెనర్ అంకుశ్ బైన్స్ (హిమాచల్‌ప్రదేశ్) రెండు అర్ధ సెంచరీలతో పాటు ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ హేర్వాడ్కర్ (ముంబై) కూడా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో చక్కటి సెంచరీ సాధించి ఆ తర్వాత నేపాల్‌పై కూడా చెలరేగి ఆడాడు. ఇక కెప్టెన్ విజయ్ జోల్ (మహారాష్ట్ర), సంజు సామ్సన్ (కేరళ) ఈ యువ జట్టులో సీనియర్లుగా బాధ్యతతో జట్టును నడిపించారు. ఫైనల్లో ఈ ఇద్దరి భాగస్వామ్యమే జట్టుకు టైటిల్ అందించింది. గత వరల్డ్ కప్ విజయంలో సభ్యుడిగా ఉన్న జోల్ ఇప్పుడు వచ్చే వరల్డ్‌కప్‌లో టీమ్‌ను నడిపించేందుకు తనకు అర్హత ఉందని నిరూపించుకున్నాడు.
 
  సర్ఫరాజ్ ఖాన్ (ముంబై) బ్యాట్స్‌మన్‌గా గత సిరీస్ ఫామ్‌ను కొనసాగించలేకపోయినా, బౌలింగ్‌లో ఆకట్టుకోవడం విశేషం. పేసర్ దీపక్ హుడా (హర్యానా) తొలి మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి టోర్నీలో శుభారంభం అందించగా, ఫైనల్లో 2 వికెట్లతో జట్టును నిలబెట్టాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ ఆమిర్ గని (ఉత్తరప్రదేశ్) కీలక వికెట్లు పడగొట్టాడు. చినామన్ శైలితో బౌలింగ్ చేసే కుల్దీప్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 15 వికెట్లు తీశాడు. ఇక ఏపీ ఆటగాళ్లు రికీ భుయ్, సీవీ మిలింద్ కూడా తాజా విజయంలో భాగమయ్యారు.
 
 సీనియర్ స్థాయిలో...
 గతంలో భారత అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనేక మంది ఆటగాళ్లు సీనియర్ స్థాయిలోనూ విలువైన ఆటగాళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, కైఫ్, దినేశ్ కార్తీక్, రైనా, కోహ్లిలాంటి చాలా మంది ఈ జాబితాలో ఉన్నారు. కేరళ ఆటగాడు సంజు సామ్సన్ అయితే ఐపీఎల్‌లో రాజస్థాన్ జట్టు తరఫున కీలక ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. 2012 వరల్డ్ కప్ గెలిచిన జట్టు కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ ఐపీఎల్ ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆ జట్టులో సభ్యులైన బాబా అపరాజిత్, హనుమ విహారి, విజయ్ జోల్ ఈ ఏడాది రంజీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన కనబర్చారు. కేవలం అండర్-19 స్థాయితోనే సరి పెట్టుకోకుండా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడగల సత్తా కూడా తమకుందని వీరు నిరూపించారు. తద్వారా సీనియర్ స్థాయి ఆటకు కావాల్సిన అనుభవాన్ని మూటగట్టుకున్నారు.
 
 టెస్టులు పెరగాలి...
 అయితే వన్డేల్లో యూత్ క్రికెట్ పెరిగినా సుదీర్ఘ ఫార్మాట్‌లో మ్యాచ్‌లో సంఖ్య పెరగాల్సి ఉంది. గత 9 ఏళ్లలో భారత అండర్-19 టీమ్ కేవలం 8 టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడింది. 2013లో ఒకే ఒక్క సిరీస్ శ్రీలంకతో జరిగింది. విశేషం ఏమిటంటే వీటిలో ఒక్క సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలాంటి జట్లపై కూడా మన టీమ్ సిరీస్ విజయం సాధించింది.
 
  టెస్టు క్రికెట్‌లో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యం, సాంకేతికత కుర్రాళ్లకు ఈ నాలుగు రోజుల ఫార్మేట్‌లోనే లభిస్తుంది. కాబట్టి బీసీసీఐ వీటిపై కూడా దృష్టి సారిస్తే మరిన్ని సిరీస్‌లకు అవకాశం ఉంటుంది. వీటిల్లో రాణించే అండర్-19 కుర్రాళ్లు భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌ను కూడా సమర్థంగా ఆడి నిలబడగలరనడంలో ఎలాంటి సందేహం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement