
మోర్కెల్‌ను కలిసిన ‘అనుమానాస్పద వ్యక్తి’
పూర్తి నివేదిక కోసం వేచి చూస్తున్నాం
యూఏఈలో ఐపీఎల్ సక్సెస్
బీసీసీఐ వెల్లడి
ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ పేసర్ మోర్నీ మోర్కెల్‌ను ఓ ‘అనుమానాస్పద వ్యక్తి’ సంప్రదించడం మినహాయిస్తే యూఏఈలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లు విజయవంతమయ్యాయని బీసీసీఐ వెల్లడించింది. మిగతా టోర్నీ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మోర్కెల్ అంశం ప్రస్తావనకు రావడంతో... పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ సమాధానమిచ్చారు. ‘ఐపీఎల్ అవినీతి నిరోధక యూనిట్ ఈ విషయాన్ని చూసుకుంటోంది. పూర్తిస్థాయి నివేదికలు రావాల్సి ఉంది.
గవర్నింగ్ కౌన్సిల్‌లో ఇలాంటి చర్చలు సర్వసాధారణం’ అని పటేల్ పేర్కొన్నారు. యూఏఈలో జరిగిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ అన్నారు. ‘మేం తీసుకున్న కొన్ని చర్యల వల్ల యూఏఈలో మ్యాచ్‌లు సక్సెస్ అయ్యాయి. ఇది మాలో విశ్వాసాన్ని నింపింది. ఇది ఇలాగే కొనసాగితే భారత్‌లో కూడా టోర్నీ వివాదాలు లేకుండా సాగిపోతుంది. నిజాయితీ గల అధికారులు ప్రతి జట్టు వెంట ఉండటం మాకు లాభించింది. యువ ఆటగాళ్లకు అవసరమైన సహాయాన్ని మేం అందించాం. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ అని మాత్రమే గుర్తుంచుకునేలా కృషి చేస్తాం’ అని సన్నీ వివరించారు.
ఆదరణ అదుర్స్
యూఏఈ, అబుదాబి, షార్జాల్లో నిర్వహించిన మ్యాచ్‌లకు అభిమానుల ఆదరణతో పాటు టెలివిజన్ వ్యూవర్‌షిప్, టిక్కెట్ కలెక్షన్ చాలా బాగుందని బీసీసీఐ తెలిపింది. ‘దక్షిణాఫ్రికా (2009లో 56 శాతమే)తో పోలిస్తే ప్రతి మ్యాచ్‌కు 82 శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తొలి 10 రోజుల్లో ఐపీఎల్ అధికారిక వెబ్‌సైట్‌ను 10 మిలియన్ల మంది సందర్శించారు. 2013తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఫేస్‌బుక్‌లో ఐపీఎల్ పేజీని లైక్ చేసిన వాళ్ల సంఖ్య 3.8 మిలియన్ నుంచి 9.1 మిలియన్‌కు చేరుకుంది. ఇది ఇంకా కొనసాగుతోంది’ అని పటేల్ తెలిపారు.