ఇంగ్లండ్ ఘనవిజయం
► రెండో టెస్టులోనూ లంక ఓటమి
► 10 వేల పరుగుల క్లబ్‌లో కుక్
► ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు
చెస్టర్ లీ స్ట్రీట్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంతో పాటు సిరీస్‌ను ఖాయం చేసుకుంది. నాలుగో రోజు సోమవారం లంక విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 23.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (65 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు ఫాలోఆన్ ఆడిన లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 128.2 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చండిమాల్ (207 బంతుల్లో 126; 13 ఫోర్లు; 1 సిక్స్) శతకం బాదగా... హెరాత్ (99 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అండర్సన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. జూన్ 9 నుంచి లార్డ్స్‌లో చివరి టెస్టు జరుగుతుంది.
10 వేల క్లబ్‌లో కుక్
ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఈ మ్యాచ్‌లో అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో తన వ్యక్తిగత స్కోరు 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్‌ను సాధించిన అతి పిన్న వయస్కుడి (31 ఏళ్ల 157 రోజులు)గా నిలుస్తూ... భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (31 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం ఇప్పటిదాకా 12 మంది ఆటగాళ్లు పదివేల పరుగుల క్లబ్‌లో ఉన్నారు.