herath
-
ఆదుకున్న ఫోక్స్, కరన్
గాలే: కెరీర్లో తొలి టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ బెన్ ఫోక్స్ (184 బంతుల్లో 87 బ్యాటింగ్; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు ఆపద్బాంధవుడిలా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 103/5తో ఇబ్బందుల్లో పడ్డ జట్టును ఆదుకొని గౌరవప్రదమైన స్కోరు అందించాడు. శ్రీలంకతో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్రువాన్ పెరీరాకు 4 వికెట్లు దక్కగా... ఒక వికెట్ సాధించిన హెరాత్ గాలే మైదానంలో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలిస్టర్ కుక్ రిటైర్ కావడంతో ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్ రోరీ బర్న్స్ (9) విఫలమయ్యాడు. మొయిన్ అలీ (0) తొలి బంతికే ఔట్ కాగా... కీటన్ జెన్నింగ్స్ (46), రూట్ (35) ధాటిగా ఆడి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. వీరిద్దరితో పాటు స్టోక్స్ (7) కూడా 31 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ దశలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ఫోక్స్ చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో అతను బట్లర్ (38), స్యామ్ కరన్ (48), రషీద్ (35)లతో వరుసగా 61, 88, 54 పరుగుల మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ప్రస్తుతం ఫోక్స్‌తో పాటు లీచ్ (14) క్రీజ్‌లో ఉన్నాడు. -
హెరాత్... ముందుగానే వీడ్కోలు
కొలంబో: శ్రీలంక వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనహెరాత్ అనుకున్నదాని కంటే ముందుగానే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాడు. 40 ఏళ్ల హెరాత్... ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ అనంతరం రిటైర్ కానున్నట్లు గతంలో తెలిపాడు. తాజాగా నవంబర్ 6 నుంచి గాలెలో జరుగనున్న మొదటి టెస్టే తనకు చివరిదని ప్రకటించాడు. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు సోమవారం ధ్రువీకరించింది. ‘దేశానికి వెలకట్టలేని సేవలందించిన హెరాత్‌కు ధన్యవాదాలు. అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటే అయినా, నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని పేర్కొంది. ఇప్పటివరకు శ్రీలంక తరఫున 92 టెస్టులు ఆడిన హెరాత్ 430 వికెట్లు పడగొట్టాడు. 71 వన్డేల్లో 74 వికెట్లు... 17 టి20ల్లో 18 వికెట్లు తీశాడు. 1999లో గాలెలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన అతడు... అదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో లంకబౌలర్ హెరాతే. -
హెరాత్ మాయాజాలం
అబుదాబి: పాకిస్తాన్ ప్రదర్శన ఎప్పుడు ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని మరోసారి రుజువైంది. ఇటీవలే స్వదేశంలో భారత్ చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురైన శ్రీలంకకు ఎట్టకేలకు నూతన ఉత్సాహామిచ్చే విజయం లభించింది. 39 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ హెరాత్ (6/43) పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. 136 పరుగుల చిన్న లక్ష్యాన్ని కాపాడిమరీ అమోఘ విజయాన్నందించాడు. నాటకీయంగా సాగిన చివరి రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. సోమవారం ముందుగా 69/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక 138 పరుగుల వద్ద ఆలౌటైంది. డిక్వెలా అజేయంగా చేసిన 40 పరుగులే లంకకు పోరాడే లక్ష్యాన్నిచ్చింది. యాసిర్ షా 5 వికెట్లు తీశాడు. తర్వాత 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 114 పరుగుల వద్ద కుప్పకూలింది. హరీస్ సొహైల్ (34) టాప్ స్కోరర్. దిల్రువాన్ పెరీరాకు 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో హెరాత్ మొత్తం 11 వికెట్లు తీశాడు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో లంక ఇప్పుడు 1–0తో ఆధిక్యంలో ఉంది. శుక్రవారం నుంచి ఇక్కడే రెండో టెస్టు జరుగుతుంది. తటస్థ వేదిక అబుదాబిలో పాకిస్తాన్ ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా... ఆ జట్టుకు ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు ఈ వేదికపై పాక్ ఐదు టెస్టుల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకుంది. కపిల్‌ను దాటేసి... టెస్టు చరిత్రలో 400 వికెట్లు తీసిన రెండో శ్రీలంక స్పిన్నర్‌గా హెరాత్ ఘనత వహించాడు. ఓవరాల్‌గా ఈ నాలుగొందల క్లబ్లో చేరిన 14వ బౌలర్, ఐదో స్పిన్నర్ హెరాత్. (మురళీధరన్, వార్న్, కుంబ్లే, హర్భజన్ సింగ్ ముందువరుసలో ఉన్నారు) అంతేకాదు తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్. పనిలో పనిగా... తన బౌలింగ్ మయాజాలంతో భారత విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (పాక్‌పై 99 వికెట్లు) రికార్డునూ అతను అధిగమించాడు. పాక్‌పై వికెట్ల సెంచరీ కొట్టిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు. -
లంక చేతిలో పాక్ ఓటమి..
అబుదాబి: పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి లంక బౌలర్లే పైచేయి సాధించారు. శ్రీలంక నిర్ధేశించిన 136 పరుగుల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాట్స్‌మెన్ రంగనా హెరాత్(6-43) దాటికి చిత్తయ్యారు. హరీస్ సోహైల్(34), అసద్ షఫిక్(20), సర్ఫరాజ్ అహ్మద్(19)లు మినహా మిగతా బ్యాట్స్‌మెన్స్ ఎవరూ రెండెంకల స్కోరు చేయలేదు. దీంతో పాక్ 114 పరుగులకే కుప్పకూలింది.హెరాత్‌కు 6 వికెట్లు, పెరీరాకు 3, లక్మాల్ ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో రంగనా హెరాత్ 400 వికెట్లు సాధించిన తొలి లెఫ్టార్మ్ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. అంతకుముందు 69/4 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు.. యాసిర్ షా దెబ్బకు విలవిల్లాడారు. స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ యాసిర్ కు దాసోహమయ్యారు. లంక ఆటగాళ్లలో నిరోషాన్ డిక్ వెల్లా(40 నాటౌట్;76 బంతుల్లో 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేదు. ఫలితంగా శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో 138 పరుగులకే చాపచుట్టేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 419 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 138 ఆలౌట్ పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ 422 ఆలౌట్ -
1000 వికెట్లతో అరుదైన ఫీట్..
కొలంబో: బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక స్పిన్నర్ రంగనా హెరాతో అరుదైన ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు. తన ఫస్టక్లాస్ కెరీర్లో వెయ్యి వికెట్లు సాధించిన మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లను తీసిన తరువాత వెయ్యి ఫస్ట్ క్లాస్ వికెట్ల క్లబ్ లో చేరాడు. తద్వారా శ్రీలంక తరపున ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా హెరాత్ నిలిచాడు. కాగా, వెయ్యి అంతకంటే ఫస్ట్ క్లాస్ వికెట్లను సాధించిన 12వ ఉప ఖండపు ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉంచితే, 214/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ 467 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్ నైట్ ఆటగాళ్లు ముష్ఫికర్ రహీమ్(52)హాఫ్ సెంచరీ సాధించగా, మరో ఓవర్ నైట్ ఆటగాడు షకిబుల్ హసన్(116) సెంచరీ సాధించాడు. వీరికి జతగా మొసదేక్ హుస్సేన్(75) రాణించడంతో బంగ్లాదేశ్ నాలుగు వందల మార్కును దాటింది. దాంతో బంగ్లాదేశ్ కు 129 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 338 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
ఒకే రోజు 21 వికెట్లు
హెరాత్ హ్యాట్రిక్ ఆసీస్‌పై విజయం దిశగా శ్రీలంక గాలె : బౌలర్లు రాజ్యమేలుతున్న శ్రీలంక, ఆస్ట్రేలియా రెండో టెస్టులో రెండో రోజు ఏకంగా 21 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్ల బౌలర్ల దెబ్బకు శుక్రవారం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌తో పాటు శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కూడా ముగియడం విశేషం. ముందుగా 54/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌ను హెరాత్ (4/35) హ్యాట్రిక్‌తో కట్టడి చేశాడు. అటు దిల్రువాన్ పెరీరా (4/29) కూడా విజృంభించడంతో ఆ జట్టు 33.2 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (42) టాప్ స్కోరర్. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 59.3 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. దిల్రువాన్ పెరీరా (64) రాణించాడు. స్టార్క్ ఆరు, లియోన్ రెండు వికెట్లు తీశారు. ఇక 413 పరుగుల లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో మూడు వికెట్లకు 25 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (22 బ్యాటింగ్), స్మిత్ (1 బ్యాటింగ్) ఉన్నారు. -
లంక స్పిన్ మ్యాజిక్.. ఆసీస్ స్వల్పస్కోరు
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. చివరి వికెట్ గా లియాన్(17)ను సందకన్ పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్లు హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించడంతో 79.2 ఓవర్లలో 203 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది. ఆసీస్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. లంక తమ తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 6 పరుగుల వద్ద ఓపెనర్ పెరీరా(4) వికెట్ కోల్పోయింది. ఆటగాళ్లు లంచ్ విరామం తీసుకోగా వర్షం ఎడతెరపి లేకుండా కురియడంతో రెండో రోజు ఆట నిలిపివేశారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 66/2తో బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ మరో మూడు పరుగులు జోడించగానే మూడో వికెట్ కోల్పోయింది. స్మిత్ (30) హెరాత్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా కీపర్ చండిమాల్ అద్భుతంగా స్టంప్ ఔట్ చేశాడు. హెరాత్ తన మరుసటి ఓవర్లో ఖవాజా(26)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 70 పరుగులకే ఆసీస్ టాపార్డర్ 4 వికెట్లను కోల్పోయింది. మార్ష్ (63 బంతుల్లో 31; 5 పోర్లు), వోజెస్(115 బంతుల్లో 47; 3 పోర్లు) ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ పోరాడకుంటే ఆసీస్ స్కోరు 200 కూడా దాటపోయేది. అక్కడి నుంచి ఆసీస్ వరుస విరామాలలో నెవిల్(2), వోజెస్(47), స్టార్క్(11), కీఫె(23), లియాన్(17) వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించాడు. మరో బౌలర్ ప్రదీప్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (3/12), పేసర్ హాజెల్‌వుడ్ (3/21) ధాటికి లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే ఆలౌటైంది. -
ఇంగ్లండ్ ఘనవిజయం
► రెండో టెస్టులోనూ లంక ఓటమి ► 10 వేల పరుగుల క్లబ్లో కుక్ ► ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా రికార్డు చెస్టర్ లీ స్ట్రీట్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంతో పాటు సిరీస్‌ను ఖాయం చేసుకుంది. నాలుగో రోజు సోమవారం లంక విధించిన 79 పరుగుల లక్ష్యాన్ని ఆతిథ్య జట్టు 23.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (65 బంతుల్లో 47 నాటౌట్; 7 ఫోర్లు) రాణించాడు. అంతకుముందు ఫాలోఆన్ ఆడిన లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 128.2 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌట్ అయ్యింది. చండిమాల్ (207 బంతుల్లో 126; 13 ఫోర్లు; 1 సిక్స్) శతకం బాదగా... హెరాత్ (99 బంతుల్లో 61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేశాడు. అండర్సన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. జూన్ 9 నుంచి లార్డ్స్‌లో చివరి టెస్టు జరుగుతుంది. 10 వేల క్లబ్లో కుక్ ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఈ మ్యాచ్‌లో అరుదైన ఫీట్‌ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో తన వ్యక్తిగత స్కోరు 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు టెస్టుల్లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇంగ్లండ్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఫీట్‌ను సాధించిన అతి పిన్న వయస్కుడి (31 ఏళ్ల 157 రోజులు)గా నిలుస్తూ... భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (31 ఏళ్ల 326 రోజులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మొత్తం ఇప్పటిదాకా 12 మంది ఆటగాళ్లు పదివేల పరుగుల క్లబ్లో ఉన్నారు. -
మలింగ, హెరాత్‌లకు విశ్రాంతి
భారత్‌తో తొలి మూడు వన్డేలకు లంక జట్టు ప్రకటన కొలంబో: భారత్‌తో వన్డే సిరీస్‌లో శ్రీలంక నలుగురు ప్రధాన ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతోంది. నవంబరు 2 నుంచి జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల కోసం లంక జట్టును ప్రకటించారు. స్టార్ పేసర్ మలింగతో పాటు ప్రధాన స్పిన్నర్ హెరాత్‌కూ విశ్రాంతి ఇచ్చారు. అలాగే మిడిలార్డర్లో కీలక బ్యాట్స్‌మెన్ తిరిమన్నె, చండీమల్‌లను తప్పించారు. అయితే ఈ ఆకస్మిక సిరీస్‌పై అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగక్కర కూడా భారత్‌కు రావడం అనుమానంగానే ఉంది. జయసూర్య సారథ్యంలోని సెలక్టర్ల బృందం ప్రకటించిన జట్టులో సంగక్కర ఉన్నా... తను వెన్నునొప్పితో బాధపడుతున్నాడని సమాచారం. సంగక్కరతో పాటు తిషార పెరీరా కూడా గాయం కారణంగా భారత్‌కు రాకపోవచ్చు. పేసర్ గమాగేను తొలిసారి జట్టులోకి ఎంపిక చేశారు. తొలి మూడు వన్డేలకు శ్రీలంక జట్టు: మాథ్యూస్ (కెప్టెన్), దిల్షాన్, కుశాల్ పెరీరా, తరంగ, సంగక్కర, జయవర్ధనే, ప్రియాంజన్, డిక్వెల్లా, తిషార పెరీరా, కులశేఖర, దమ్మిక ప్రసాద్, గమాగే, చతురంగ డిసిల్వ, ప్రసన్న, రణ్‌దివ్. -
హెరాత్ విజృంభణ
- పాక్ తొలి ఇన్నింగ్స్ 244/6 - శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 320 కొలంబో: శ్రీలంక లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగన హెరాత్ (5/98) ధాటికి పాకిస్థాన్ టాప్ ఆర్డర్ కకావికలమైంది. ఫలితంగా సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు శుక్రవారం మిస్బా సేన 70 ఓవర్లలో ఆరు వికెట్లకు 244 పరుగులు చేసింది. ఓపెనర్ అహ్మద్ షెహజాద్ (85 బంతుల్లో 58; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకోగా... చివర్లో వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (81 బంతుల్లో 66 బ్యాటింగ్; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు. అసద్ షఫీఖ్ (90 బంతుల్లో 42; 2 ఫోర్లు), అజహర్ అలీ (77 బంతుల్లో 32; 2 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు. హెరాత్ దెబ్బకు ఓ దశలో 140 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన పాక్‌ను అసద్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు వీరు 93 పరుగులు జోడించారు. టాప్ ఆర్డర్లో వరుసగా ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లో ఐదుగురిని పెవిలియన్‌కు పంపిన హెరాత్ తన టెస్టు కెరీర్లో 250 వికెట్ల మైలురాయిని దాటాడు. ఇది శ్రీలంక తరఫున మూడో అత్యుత్తమ రికార్డు. గతంలో మురళీధరన్ (800), వాస్ (355) ఉన్నారు. అంతకుముందు 261/8 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన లంక లంచ్ విరామానికి కొద్ది ముందు 99.3 ఓవర్లలో 320 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జునైద్ ఖాన్‌కు ఐదు, వహాబ్ రియాజ్‌కు మూడు వికెట్లు దక్కాయి. -
శ్రీలంకదే తొలి టెస్టు
చెలరేగిన హెరాత్ - రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన పాక్ - ఏడు వికెట్లతో శ్రీలంక గెలుపు గాలె: ‘డ్రా’ ఖాయమనుకున్న మ్యాచ్‌ను శ్రీలంక బౌలర్ రంగన హెరాత్ తన స్పిన్ మాయాజాలంతో మలుపు తిప్పాడు. ఊహించని విధంగా శ్రీలంకకు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని అందించాడు. నిలకడలేని బ్యాటింగ్‌కు పర్యాయ పదంగా మారిన పాకిస్థాన్ మరోసారి కీలకదశలో చేతులెత్తేసి మూల్యం చెల్లించుకుంది. చివరిరోజు నాటకీయ పరిణామాల నేపథ్యంలో తొలి టెస్టులో శ్రీలంక అద్భుత విజయాన్ని సొంతం చేసుకొని రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. రంగన హెరాత్ (6/48) సుడులు తిరిగే బంతులకు మిస్బా సేన చివరి రోజు ఆదివారం తమ రెండో ఇన్నింగ్స్‌లో 80.2 ఓవర్లలో180 పరుగులకే కుప్పకూలింది. వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ (70 బంతుల్లో 52; 5 ఫోర్లు), అజహర్ అలీ (151 బంతుల్లో 41; 4 ఫోర్లు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఆ తర్వాత 21 ఓవర్లలో 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక వేగంగా ఆడి 16.2 ఓవర్లలో 3 వికెట్లకు మ్యాచ్‌ను ముగించింది. వెంటనే భారీ వర్షం కురవడంతో లంక ఊపిరిపీల్చుకుంది. మేఘావృత వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకున్న కెప్టెన్ మాథ్యూస్ (13 బంతుల్లో 25 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) చెలరేగాడు. జునైద్ ఖాన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు 4/1 ఓవర్ నైట్ స్కోరుతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ తొలి సెషన్లోనే మూడు వికెట్లను కోల్పోయింది. 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన వేళ మిస్బా (64 బంతుల్లో 28; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి అజర్ అలీ ఐదో వికెట్‌కు 56 పరుగులు జోడించాడు. ఈదశలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హెరాత్ పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను వణికించాడు. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు గురువారం నుంచి కొలంబోలో ప్రారంభమవుతుంది.