ఒకే రోజు 21 వికెట్లు
హెరాత్ హ్యాట్రిక్ ఆసీస్‌పై విజయం దిశగా శ్రీలంక
గాలె : బౌలర్లు రాజ్యమేలుతున్న శ్రీలంక, ఆస్ట్రేలియా రెండో టెస్టులో రెండో రోజు ఏకంగా 21 వికెట్లు నేలకూలాయి. ఇరు జట్ల బౌలర్ల దెబ్బకు శుక్రవారం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌తో పాటు శ్రీలంక రెండో ఇన్నింగ్స్ కూడా ముగియడం విశేషం. ముందుగా 54/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్‌ను హెరాత్ (4/35) హ్యాట్రిక్‌తో కట్టడి చేశాడు. అటు దిల్‌రువాన్ పెరీరా (4/29) కూడా విజృంభించడంతో ఆ జట్టు 33.2 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. వార్నర్ (42) టాప్ స్కోరర్.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన లంక 59.3 ఓవర్లలో 237 పరుగులకు ఆలౌటైంది. దిల్‌రువాన్ పెరీరా (64) రాణించాడు. స్టార్క్ ఆరు, లియోన్ రెండు వికెట్లు తీశారు. ఇక 413 పరుగుల లక్ష్యంతో తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసేసరికి 6 ఓవర్లలో మూడు వికెట్లకు 25 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్ (22 బ్యాటింగ్), స్మిత్ (1 బ్యాటింగ్) ఉన్నారు.