
కొలంబో: శ్రీలంక వెటరన్ లెఫ్టార్మ్ స్పిన్నర్ రంగనహెరాత్ అనుకున్నదాని కంటే ముందుగానే క్రికెట్ నుంచి వైదొలుగుతున్నాడు. 40 ఏళ్ల హెరాత్... ఇంగ్లండ్‌తో మూడు టెస్టుల సిరీస్ అనంతరం రిటైర్ కానున్నట్లు గతంలో తెలిపాడు. తాజాగా నవంబర్ 6 నుంచి గాలెలో జరుగనున్న మొదటి టెస్టే తనకు చివరిదని ప్రకటించాడు. ఈ విషయాన్ని శ్రీలంక బోర్డు సోమవారం ధ్రువీకరించింది. ‘దేశానికి వెలకట్టలేని సేవలందించిన హెరాత్‌కు ధన్యవాదాలు.
అతడు లేకపోవడం జట్టుకు పెద్ద లోటే అయినా, నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం’ అని పేర్కొంది. ఇప్పటివరకు శ్రీలంక తరఫున 92 టెస్టులు ఆడిన హెరాత్ 430 వికెట్లు పడగొట్టాడు. 71 వన్డేల్లో 74 వికెట్లు... 17 టి20ల్లో 18 వికెట్లు తీశాడు. 1999లో గాలెలో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన అతడు... అదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకనున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (800) తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన రెండో లంకబౌలర్ హెరాతే.