
గాలే: కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ బెన్ ఫోక్స్ (184 బంతుల్లో 87 బ్యాటింగ్; 6 ఫోర్లు) ఇంగ్లండ్‌కు ఆపద్బాంధవుడిలా నిలిచాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 103/5తో ఇబ్బందుల్లో పడ్డ జట్టును ఆదుకొని గౌరవప్రదమైన స్కోరు అందించాడు. శ్రీలంకతో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్‌రువాన్ పెరీరాకు 4 వికెట్లు దక్కగా... ఒక వికెట్ సాధించిన హెరాత్ గాలే మైదానంలో 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అలిస్టర్ కుక్ రిటైర్ కావడంతో ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన ఓపెనర్ రోరీ బర్న్స్ (9) విఫలమయ్యాడు. మొయిన్ అలీ (0) తొలి బంతికే ఔట్ కాగా... కీటన్ జెన్నింగ్స్ (46), రూట్ (35) ధాటిగా ఆడి మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు. వీరిద్దరితో పాటు స్టోక్స్ (7) కూడా 31 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ దశలో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ఫోక్స్ చక్కటి షాట్‌లతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో అతను బట్లర్ (38), స్యామ్ కరన్ (48), రషీద్ (35)లతో వరుసగా 61, 88, 54 పరుగుల మూడు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పడం విశేషం. ప్రస్తుతం ఫోక్స్‌తో పాటు లీచ్ (14) క్రీజ్‌లో ఉన్నాడు.