అబుదాబి: పాకిస్తాన్ ప్రదర్శన ఎప్పుడు ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పలేమని మరోసారి రుజువైంది. ఇటీవలే స్వదేశంలో భారత్ చేతిలో క్లీన్‌స్వీప్‌నకు గురైన శ్రీలంకకు ఎట్టకేలకు నూతన ఉత్సాహామిచ్చే విజయం లభించింది. 39 ఏళ్ల వెటరన్ స్పిన్నర్ హెరాత్ (6/43) పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను తిప్పేశాడు. 136 పరుగుల చిన్న లక్ష్యాన్ని కాపాడిమరీ అమోఘ విజయాన్నందించాడు. నాటకీయంగా సాగిన చివరి రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. సోమవారం ముందుగా 69/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన శ్రీలంక 138 పరుగుల వద్ద ఆలౌటైంది. డిక్‌వెలా అజేయంగా చేసిన 40 పరుగులే లంకకు పోరాడే లక్ష్యాన్నిచ్చింది.
యాసిర్ షా 5 వికెట్లు తీశాడు. తర్వాత 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 114 పరుగుల వద్ద కుప్పకూలింది. హరీస్ సొహైల్ (34) టాప్ స్కోరర్. దిల్‌రువాన్ పెరీరాకు 3 వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో హెరాత్ మొత్తం 11 వికెట్లు తీశాడు. రెండు టెస్టుల ఈ సిరీస్‌లో లంక ఇప్పుడు 1–0తో ఆధిక్యంలో ఉంది. శుక్రవారం నుంచి ఇక్కడే రెండో టెస్టు జరుగుతుంది. తటస్థ వేదిక అబుదాబిలో పాకిస్తాన్ ఇప్పటివరకు 10 టెస్టులు ఆడగా... ఆ జట్టుకు ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. ఇంతకుముందు ఈ వేదికపై పాక్ ఐదు టెస్టుల్లో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకుంది.
కపిల్‌ను దాటేసి...
టెస్టు చరిత్రలో 400 వికెట్లు తీసిన రెండో శ్రీలంక స్పిన్నర్‌గా హెరాత్ ఘనత వహించాడు. ఓవరాల్‌గా ఈ నాలుగొందల క్లబ్‌లో చేరిన 14వ బౌలర్, ఐదో స్పిన్నర్ హెరాత్. (మురళీధరన్, వార్న్, కుంబ్లే, హర్భజన్ సింగ్ ముందువరుసలో ఉన్నారు) అంతేకాదు తొలి లెఫ్టార్మ్ స్పిన్నర్. పనిలో పనిగా... తన బౌలింగ్ మయాజాలంతో భారత విఖ్యాత ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ (పాక్‌పై 99 వికెట్లు) రికార్డునూ అతను అధిగమించాడు. పాక్‌పై వికెట్ల సెంచరీ కొట్టిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
హెరాత్ మాయాజాలం
Published Tue, Oct 3 2017 12:43 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement
Advertisement