లంక స్పిన్ మ్యాజిక్.. ఆసీస్ స్వల్పస్కోరు
పల్లెకెలె: శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో తమ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. చివరి వికెట్ గా లియాన్(17)ను సందకన్ పెవిలియన్ చేర్చడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. స్పిన్నర్లు హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించడంతో 79.2 ఓవర్లలో 203 పరుగుల వద్ద ఆసీస్ ఆలౌటైంది. ఆసీస్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉంది. లంక తమ తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక 6 పరుగుల వద్ద ఓపెనర్ పెరీరా(4) వికెట్ కోల్పోయింది. ఆటగాళ్లు లంచ్ విరామం తీసుకోగా వర్షం ఎడతెరపి లేకుండా కురియడంతో రెండో రోజు ఆట నిలిపివేశారు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 66/2తో బ్యాటింగ్కు దిగిన ఆసీస్ మరో మూడు పరుగులు జోడించగానే మూడో వికెట్ కోల్పోయింది. స్మిత్ (30) హెరాత్ బౌలింగ్ లో ముందుకొచ్చి ఆడగా కీపర్ చండిమాల్ అద్భుతంగా స్టంప్ ఔట్ చేశాడు. హెరాత్ తన మరుసటి ఓవర్లో ఖవాజా(26)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 70 పరుగులకే ఆసీస్ టాపార్డర్ 4 వికెట్లను కోల్పోయింది.
మార్ష్ (63 బంతుల్లో 31; 5 పోర్లు), వోజెస్(115 బంతుల్లో 47; 3 పోర్లు) ఐదో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ పోరాడకుంటే ఆసీస్ స్కోరు 200 కూడా దాటపోయేది. అక్కడి నుంచి ఆసీస్ వరుస విరామాలలో నెవిల్(2), వోజెస్(47), స్టార్క్(11), కీఫె(23), లియాన్(17) వికెట్లు కోల్పోయింది. లంక బౌలర్లలో హెరాత్(4/49) టాపార్డర్ పని పట్టగా, సందకన్ (4/58) లోయర్ ఆర్డర్ ను పెవిలియన్ బాట పట్టించాడు. మరో బౌలర్ ప్రదీప్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ (3/12), పేసర్ హాజెల్‌వుడ్ (3/21) ధాటికి లంక తొలి ఇన్నింగ్స్ లో 117 పరుగులకే ఆలౌటైంది.