
బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లేందుకు ఆస్ట్రేలియా కేవలం 56 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 10 వికెట్లున్న ఆసీస్ తొలి టెస్టులో ఈ లాంఛనాన్ని ఆట చివరి రోజు సోమవారం గంటలోనే పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు. తమకు అచ్చొచ్చిన బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు హాజల్‌వుడ్ (3/46), స్టార్క్ (3/51), లయన్ (3/67) చెలరేగారు. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట నిలిచే సమయానికి 34 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 114 పరుగులు చేసింది. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ 51 పరుగులతో, వార్నర్ 60 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
తొలి సెషన్‌లోనే పతనం: ఓవర్‌నైట్ స్కోరు 33/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ తొలి సెషన్‌లోనే సగం వికెట్లను కోల్పోయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ స్టోన్‌మన్, కెప్టెన్ రూట్ కుదురుగా ఆడుతూ జట్టు స్కోరును 60 పరుగులకు చేర్చారు. మరో రెండు పరుగులు జతయ్యాక మొదట స్టోన్‌మన్ (27; 4 ఫోర్లు)ను... ఐదు ఓవర్ల వ్యవధిలో మలాన్ (4)ను లయన్ ఔట్ చేసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న రూట్ (51; 5 ఫోర్లు)ను హాజల్‌వుడ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ (119/5) సగం వికెట్లను కోల్పోయి లంచ్‌కు వెళ్లింది.
టెయిలెండర్లు నిలబడినా: రెండో సెషన్‌లో మొయిన్ అలీ (40; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (42; 2 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు నిలబడినా... ఆస్ట్రేలియా పేసర్ల ధాటికి నిలదొక్కుకోలేకపోయారు. ఆరో వికెట్‌కు 42 పరుగులు జతయ్యాక అలీని లయన్ వెనక్కిపంపగా మిగతా వికెట్లను స్టార్క్ చేజిక్కించుకున్నాడు. కమిన్స్‌కు ఒక వికెట్ దక్కింది. తర్వాత 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు వార్నర్, బాన్‌క్రాఫ్ట్ శుభారంభమిచ్చారు. వీళ్లిద్దరు అర్ధసెంచరీలు పూర్తిచేసుకొని అబేధ్యమైన తొలి వికెట్‌కు 114 పరుగులు జోడించారు.
సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 302, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 328, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 195, ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 114/0 (బాన్‌క్రాఫ్ట్ 51 బ్యాటింగ్, వార్నర్ 60 బ్యాటింగ్).
Comments
Please login to add a commentAdd a comment