నో బాల్స్ | England will play West Indies in World T20 final as Simmons breaks India hearts | Sakshi
Sakshi News home page

నో బాల్స్

Published Fri, Apr 1 2016 12:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

నో బాల్స్

నో బాల్స్

భారత్‌కు పరాభవం సెమీస్‌లో 7 వికెట్లతో వెస్టిండీస్ విజయం
గెలిపించిన సిమన్స్, చార్లెస్, రసెల్
విరాట్ కోహ్లి శ్రమ వృథా
ఆదివారం ఫైనల్లో ఇంగ్లండ్‌తో కరీబియన్ల ఢీ

స్వయంకృతాపరాధం... భారత జట్టును వెస్టిండీస్ ఓడించలేదు... మనల్ని మనమే ఓడించుకున్నాం. ఇది స్వీయ విధ్వంసమే. ఒక స్పిన్నర్ అయి ఉండీ అశ్విన్ నోబాల్‌తో ఒక సారి బ్యాట్స్‌మెన్ ఇన్నింగ్స్‌కు ప్రాణం పోస్తే, పాండ్యా మరో నోబాల్‌తో అతనికి బ్రతుకుదెరువు కల్పించాడు. ఫలితమే వరల్డ్ కప్‌నుంచి భారత జట్టు నిష్ర్కమణ. సెమీస్‌తోనే ముగిసిన ధోని సేన పోరాటం.

ఎవరు ఊహించారు... 192 పరుగులు చేశాక కూడా భారత్ ఓడిపోతుందని. ఎవరు అనుకున్నారు... కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ తర్వాత కూడా ప్రత్యర్థికి అవకాశం లభిస్తుందని. సెమీఫైనల్‌కు ముందు వరకు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తున్నా... బౌలర్ల గురించి ఎలాంటి ఫిర్యాదు లేదు. ఆస్ట్రేలియా పర్యటననుంచి అంతా బాగుందని మెచ్చుకుంటూ వచ్చిన బౌలర్లే చివరకు కొంప ముంచారు. ఏకంగా 11 సిక్సర్లు సమర్పించుకొని పరాజయాన్ని ఆహ్వానించారు.

గేల్‌ను అవుట్ చేసి సగం మ్యాచ్ గెలిచామని సంబరపడేలోపే... సిమన్స్ రూపంలో భారత్‌ను ప్రళయం చుట్టేసింది. టోర్నీలో ఆడుతోంది తొలి మ్యాచ్ అయినా... ముంబై ఇండియన్స్ తరఫున వాంఖడేలో ఆడిన అనుభవాన్ని ఉపయోగించుకుని సంచలన హిట్టింగ్‌తో వెస్టిండీస్‌ను ఫైనల్‌కు చేర్చాడు. రసెల్, చార్లెస్‌ల అండతో తడబాటు లేకుండా కరీబియన్లను గట్టెక్కించాడు.

 ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- కథ ముగిసిపోయింది... కోట్లాది మంది అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ భారత జట్టు ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనే నిష్ర్కమించింది. కోహ్లి మెరుపు బ్యాటింగ్‌తో మరో విజయంపై ధీమా కనిపించినా... విండీస్ టి20 స్పెషలిస్ట్‌లు తమదైన బాణీలో బ్యాండ్ మోగించడంతో టీమిండియా నిరాశగా వెనుదిరగక తప్పలేదు. ఇక్కడి వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (47 బంతుల్లో 89 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు రోహిత్ శర్మ (31 బంతుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రహానే (35 బంతుల్లో 40; 2 ఫోర్లు) రాణించారు. అనంతరం విండీస్ 19.4 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లెండిల్ సిమన్స్ (51 బంతుల్లో 82 నాటౌట్;  7 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా, చార్లెస్ (36 బంతుల్లో 52; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రసెల్ (20 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించారు. ఈ విజయంతో విండీస్ రెండో సారి ఫైనల్ చేరింది. ఆదివారం కోల్‌కతాలో జరిగే తుది పోరులో ఆ జట్టు ఇంగ్లండ్‌తో తలపడుతుంది.

కోహ్లి మళ్లీ సూపర్: గాయపడిన యువరాజ్ స్థానంలో మనీష్ పాండేకు అవకాశం దక్కగా, వరుసగా విఫలమవుతున్న ధావన్‌ను ఎట్టకేలకు తప్పించి టీమ్ మేనేజ్‌మెంట్ రహానేకు ఓపెనర్‌గా అవకాశం ఇచ్చింది.  రోహిత్, రహానే ఈ మ్యాచ్‌లో తొలి వికెట్‌కు 44 బంతుల్లో 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్ అవుటయ్యాక కోహ్లి మరోసారి చెలరేగాడు. కోహ్లి, రహానే చకచకా పరుగులు తీశారు. భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే బౌండరీ వద్ద క్యాచ్ ఇవ్వడంతో 49 బంతుల్లో 66 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ధోని (9 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్) భారీ షాట్లు ఆడకపోయినా, కోహ్లికి అండగా నిలిచాడు ఈ క్రమంలో కోహ్లి 33 బంతుల్లోనే  అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో గేల్ (15)ను అధిగమించి అత్యధిక సార్లు (16) 50కి పైగా స్కోరు చేసిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సాధించాడు. వీరిద్దరు 27 బంతుల్లోనే అభేద్యంగా 66 పరుగులు జత చేశారు. ఇందులో కోహ్లి ఒక్కడివే 48 పరుగులు ఉన్నాయి. చివరి 4 ఓవర్లలో భారత్ 17, 11, 19, 12 (మొత్తం 59) పరుగులు సాధించింది.

భారీ భాగస్వామ్యాలు: ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన బుమ్రా వెస్టిండీస్‌కు తొలి  షాక్ ఇచ్చాడు. తక్కువ ఎత్తులో వచ్చిన ఫుల్‌టాస్ బంతి ఊహించినదానికంటే ఎక్కువగా స్వింగ్ అయి నేరుగా ఆఫ్‌స్టంప్‌ను తాకడంతో గేల్ (5) వెనుదిరిగాడు. శామ్యూల్స్ (8) కూడా తొందరగానే అవుటైనా...సిమన్స్, చార్లెస్ భాగస్వామ్యం భారత్‌ను ఇబ్బంది పెట్టింది. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్నా, వీరిద్దరు ఆ తర్వాత భారీ షాట్లు ఆడారు. బుమ్రా, అశ్విన్, పాండ్యా, జడేజా... ఇలా ఏ భారత్ బౌలర్‌నూ వీరు వదిలి పెట్టలేదు. ఒక దశలో వరుసగా ఐదు ఓవర్లలో వీరిద్దరు కలిసి 64 పరుగులు రాబట్టారు. బౌలర్లంతా విఫలం కావడంతో చివరకు 13వ ఓవర్లో ధోని అనూహ్యంగా కోహ్లి చేతికి బంతిని అప్పగించాడు. కోహ్లి తొలి బంతికే వికెట్ తీసినా.... సిమన్స్‌కు జత కలిసిన రసెల్ కూడా అదే స్థాయి దూకుడు ప్రదర్శించడంతో స్కోరు జోరుగా పెరిగింది. వీరిద్దరు ఆ తర్వాత బౌలర్లపై భీకరంగా ఎదురు దాడికి దిగి 39 బంతుల్లోనే అభేద్యంగా 80 పరుగులు జోడించడంతో విండీస్ సంచలన విజయం సాధించింది.

స్కోరు వివరాల
భారత్ ఇన్నింగ్స్:
రోహిత్ (ఎల్బీ) (బి) బద్రీ 43; రహానే (సి) బ్రేవో (బి) రసెల్ 40; కోహ్లి (నాటౌట్) 89; ధోని (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 192.
వికెట్ల పతనం: 1-62; 2-128.
బౌలింగ్: రసెల్ 4-0-47-1; బద్రీ 4-0-26-1; బ్రాత్‌వైట్ 4-0-38-0; బెన్ 4-0-36-0; బ్రేవో 4-0-44-0.

వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) రోహిత్ (బి) కోహ్లి 52; గేల్ (బి) బుమ్రా 5; శామ్యూల్స్ (సి) రహానే (బి) నెహ్రా 8; సిమన్స్ (నాటౌట్) 82; రసెల్ (నాటౌట్) 43; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో 3 వికెట్లకు) 196.
వికెట్ల పతనం: 1-6; 2-19; 3-116.
బౌలింగ్: నెహ్రా 4-0-24-1; బుమ్రా 4-0-42-1; జడేజా 40-0-48-0; అశ్విన్ 2-0-20-0; పాండ్యా 4-0-43-0; కోహ్లి 1.4-0-15-1.

2 వికెట్లు, 2 నోబాల్స్...
అశ్విన్ వేసిన ఏడో ఓవర్‌లో సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను షార్ట్ థర్డ్ మ్యాన్‌లో బుమ్రా చక్కటి క్యాచ్ అందుకున్నాడు. అయితే అది నోబాల్ కావడంతో సిమన్స్ బతికిపోయాడు. అప్పుటికి అతను చేసిన పరుగులు 18. ఆ తర్వాత వ్యక్తిగత స్కోరు 50 వద్ద పాండ్యా బౌలింగ్‌లో అశ్విన్‌కు క్యాచ్ ఇచ్చి సిమన్స్ అవుటయ్యాడు. కానీ అది కూడా నోబాల్. ఇక 18వ ఓవర్లో కూడా బౌండరీ వద్ద ర్యాలీ క్యాచ్‌తో జడేజా, కోహ్లి అవుట్ చేసేందుకు ప్రయత్నించినా, జడేజా కాలు బౌండరీకి తాకడంతో అది సిక్సర్‌గా మారింది. ముచ్చటగా మూడో సారి కూడా సిమన్స్‌కు అదృష్టం కలిసొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement