ఇండియాను ఏకిపారేయండి: మణి
కరాచీ: భారత్ ను అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్య(ఐసీసీ) మాజీ అధ్యక్షుడు ఇహసాన్ మణి.. పాకిస్థాన్ క్రికెట్ సంఘం(పీసీబీ)కు సూచించారు. పాకిస్థాన్ పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ థాకూర్ పై ఆయన విమర్శలు గుప్పించారు. ఐసీసీ సమావేశాల్లో భారత్ దుమ్ముదులపాలని అన్నారు. మంగళవారం రాత్రి పాకిస్థాన్ క్రికెట్ అధికారులతో ఆయన మాట్లాడారు.
'బీసీసీఐ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు అపరిపక్వంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయి. ఐసీసీ సమావేశాల్లో మనం మరింత సమర్థవంతంగా వ్యవహరించి ఇండియాను ఎదుర్కొవాల'ని ఆయన సూచించారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలపై బీసీసీఐ అధ్యక్షుడిని ఐసీసీ వివరణ అడిగేలా ఒత్తిడి తీసుకురావాలన్నారు.
ఐసీసీ నిర్వహించే టోర్నమెంట్లలో టీమిండియాతో ఆడొద్దని గత రెండేళ్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఇహసాన్ మణి సలహాయిస్తున్నారు. భారత్ ను సంతృప్తిపరిచే విధానాన్ని పాకిస్థాన్ క్రికెట్ అధికారులు అవలంభిస్తున్నారని, అందుకు టీమిండియాతో మ్యాచ్ లు రద్దు చేసుకోలేకపోతున్నారని విమర్శించారు.