హెచ్‌సీఏ అధ్యక్షుడిగా వివేక్
హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా జరిగిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపీ జి.వివేక్ (వివేకానంద్) ఘన విజయం సాధించారు. జనవరి 17న అధ్యక్ష ఎన్నికలు జరగ్గా... మొత్తం 216 ఓట్లకుగాను..206 ఓట్లు పోలయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో ఓట్ల లెక్కింపు జరి గింది. ఈ ఎన్నికల్లో వివేక్ ప్యానల్ ఘన విజయం సాధించింది. అధ్యక్ష స్థానానికి పోటీచేసిన డాక్టర్ వివేక్‌కు 136 ఓట్లు రాగా... ఆయన సమీప ప్రత్యర్థి విద్యుత్ జయసింహకు 68 ఓట్లు దక్కాయి.
వివేక్ 68 ఓట్ల ఆధిక్యంతో ఘనవిజయం సాధించారు. మరో రెండు ఓట్లు చెల్లలేదు. ఇక ఉపాధ్యక్షునిగా ఎన్నికైన అనిల్ కుమార్‌కు 138 ఓట్లు లభించగా... సమీప అభ్యర్థి ఇమ్రాన్ మహమూద్ 86 ఓట్లు దక్కాయి. సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన అఫ్జల్ అసద్‌కు 124 ఓట్లు లభించగా... ఆయన సమీప ప్రత్యర్థి వంకా ప్రతాప్‌కు 80 ఓట్లు దక్కాయి. కోశాధికారిగా ఎన్నికై న మహేంద్రకు 148 ఓట్లు దక్కగా... సమీప ప్రత్యర్థి అనురాధకు 54 ఓట్లు వచ్చాయి. కమిటీ సభ్యులుగా ఎన్నికైన హన్మంత్ రెడ్డికి 100 ఓట్లు లభించాయి.
కాగా హెచ్‌సీఏ కార్యదర్శిగా ఎన్నికైన శేష్‌నారాయణ గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం కౌంటింగ్ సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధ్యక్షునిగా ఎన్నికైన వివేక్ మాట్లాడుతూ...హెచ్‌సీఏకు మంచిరోజులు వచ్చాయన్నారు. అవినీతిలేని పా లనను అందిస్తామని, క్రికెట్‌ను మారుమూల గ్రామాల్లో కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని 31 జిల్లాల్లో హెచ్‌సీఏను విస్తరిస్తామన్నారు.