షమీపై మళ్లీ దూషణలు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీని సోషల్‌మీడియాలో మరోమారు వేలెత్తిచూపారు. గతంలో తన భార్యతో కలిసి ఉన్న ఫోటోలను ఫేస్‌బుక్‌లో పంచుకున్న షమీపై కొందరు వ్యక్తిగతంగా దూషించిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన షమీ ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తనకు తెలుసని సమాధానిమిచ్చాడు. షమీ తండ్రి మాట్లాడుతూ.. ఇస్లాం ఏం చెబుతుందో తమకు తెలుసని ఎవరి సలహాలు తమకు అవసరం లేదని కూడా చెప్పారు. షమీకి అంతా మద్దతు తెలపాలని కోరారు.
తాజాగా కుక్కతో దిగిన ఫోటోను షమీ ఫేస్‌బుక్‌లో పోస్టు చేయగా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కుక్కలను ప్రేమించాలంటూ దానిపై చేయి వేసి ఉన్న ఫోటోను షమీ తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టాడు. ఇది ఇస్లాంకు వ్యతిరేకమంటూ, ఇలాంటి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడంటూ షమీపై కొందరు కామెంట్ బాక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు. కొందరైతే షమీ తన పేరు ముందున్న మహ్మద్ ను తొలగించాలని కామెంట్ బాక్స్‌లో డిమాండ్ చేశారు.