
హామిల్టన్: న్యూజిలాండ్‌తో నాల్గో వన్డేలో టీమిండియా ఓటమి పాలైన తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చేసిన ట్వీట్ మిస్ ఫైర్ అయ్యింది. భారత్ 92 పరుగులకు ఆలౌట్ కావడాన్ని ఉదహరిస్తూ.. ఈ రోజుల్లో వంద పరుగుల లోపు ఆలౌటయ్యే జట్టు ఉందంటే అది నమ్మశక్యంగా లేదంటూ వాన్ ట్వీట్ చేశాడు. దీనిపై భారత అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
‘అసలు భారత్ జట్టును హేళన చేసే ముందు నీ జట్టు పరిస్థితి చూసుకో’ అంటూ ట్వీటర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ 77 పరుగులకు ఆలౌట్ కావడాన్ని భారత క్రికెట్ ఫ్యాన్స్ జోడించి మరీ వాన్‌ను ఆడేసుకుంటున్నారు. ‘92 పరుగులు ఎక్కువా.. 77 పరుగులు ఎక్కువా’ అంటూ వాన్‌కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ‘ ఈ రోజుల్లో 77 పరుగులకు ఆలౌటయ్యే జట్టు కూడా ఉందా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘ మా జట్టు పూర్తిస్థాయిలో బరిలోకి దిగకపోవడంతో 92 పరుగులకు ఆలౌటయ్యాం.. మరి మీరు పూర్తిస్థాయి జట్టుతో దిగి ఎనిమిదో ర్యాంక్ వెస్టిండీస్‌పై 77 పరుగులు చేయడం నమ్మశక్యంగా ఉందా’ అని ప‍్రశ్నిస్తున్నారు.