డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ క్రికెటర్ పై కేసు
మాంచెస్టర్:డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్ పట్టుబడ్డాడు. మద్యం సేవించి కారును డ్రైవ్ చేస్తుండగా గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు చేసిన తనిఖీల్లో ఫాల్కనర్ దొరికిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని కోర్టుకు తరలించారు. దీంతో అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేసి.. జూలై 21 వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది.
ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేసింది. అలా తాగి డ్రైవ్ చేయడం వల్లే చోటు చేసుకునే పరిణామాల్ని గ్రహించాలని తాము ఫాల్కనర్ కు సూచించినట్లు టీమ్ ఫెర్మామెన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ పాట్ హావర్డ్ తెలిపాడు. ఇది చాలా నిరాశకు గురిచేసిందన్నాడు. యువ క్రికెటర్లకు ఆదర్శం కావాల్సిన సీనియర్ క్రికెటర్ ఇలా చేయడం మంచి పద్దతి కాదని అభిప్రాయపడ్డాడు. ఈ తాజా ఉదంతంతో ప్రస్తుతం లాంక్ షైర్ కంట్రీ క్రికెట్ క్లబ్ కు ఆడుతున్న ఫాల్కనర్ భవితవ్యంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ జట్టుకు అతన్ని ఎంపిక చేసే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి.