గోవా ఎఫ్సీకి రూ.50 లక్షల జరిమానా | FC Goa fined Rs 50 lakh for ISL post-final fiasco | Sakshi
Sakshi News home page

గోవా ఎఫ్సీకి రూ.50 లక్షల జరిమానా

Published Fri, Mar 4 2016 7:58 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

గోవా ఎఫ్సీకి రూ.50 లక్షల జరిమానా

గోవా ఎఫ్సీకి రూ.50 లక్షల జరిమానా

న్యూఢిల్లీ:ఇండియన్ సూపర్ లీగ్లో భాగంగా గతేడాది డిసెంబర్లో చెన్నైయిన్ ఎఫ్సీతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించిన గోవా ఎఫ్సీ జట్టుకు రూ.50లక్షల జరిమానా విధించారు. ఆనాటి తుదిపోరులో గోవా ఎఫ్సీ 2-3 తేడాతో చెన్నైయిన్పై ఓటమి పాలైంది. దీంతో మ్యాచ్ తరువాత నిర్వహించే అవార్డుల కార్యక్రమానికి గోవా జట్టు హజరుకాకుండా బాయ్ కాట్ చేసింది. మరోవైపు ఆ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ ఆరోపణలకు దిగింది. దీంతో ఫుట్ బాల్ క్రమశిక్షణా కమిటీతో సుదీర్ఘంగా చర్చించిన తరువాత ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏఐఎఫ్ఎఫ్  ఆర్టికల్ 53 ప్రకారం ఇలా చేయడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు రావడంతో గోవా జట్టుకు భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ జరిమానాను 10 రోజుల వ్యవధిలో చెల్లించాలని ఏఐఎఫ్ఎఫ్ స్పష్టం చేసింది.

 

ఆ మ్యాచ్ ముగిసిన వెంటనే ఎఫ్‌సీ గోవా సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లు, అధికారులు ఎక్విప్‌మెంట్ మేనేజర్ రాజేశ్ మాల్గి ఆధ్వర్యంలో రిఫరీని చుట్టుముట్టి  భయాందోళనకు గురి చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లోనే దీనిపై వివరణ ఇవ్వాలని గోవా ఎఫ్సీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు బహుమతుల పంపిణీ కార్యక్రమాన్ని బాయ్‌కాట్ చేయడం కూడా నిబంధనలకు వ్యతిరేకం కావడంతో గోవా జట్టుకు జరిమానా విధిస్తూ ఏఐఎఫ్ఎఫ్ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement