
చరిత్ర, నాటకీయత, భావోద్వేగం కనిపించే ప్రపంచ కప్ ఫుట్‌బాల్‌లో గొప్ప క్షణాలకు సమయం ఆసన్నమైంది. 30 రోజులు, 63 మ్యాచ్‌ల తర్వాత ప్రతి అభిమాని ఎదురుచూసే రోజు రానే వచ్చేసింది. ఫైనల్ సంకల్ప శక్తికి సంబంధించినది. అంతిమ సమరంలో వ్యూహాత్మక, సాంకేతిక అంశాలది కీలక పాత్ర. ప్రపంచంలో ఉత్తమ లైనప్‌ల మధ్య ఈ సందర్భంలో మనం ఏదైనా ఆశించవచ్చు. ఇదే సమయంలో బలీయమైన కోరిక అవసరం. నువ్వు ఇటువైపు ఎలా ఉన్నావన్నది కాదు, వచ్చిన అవకాశాన్ని ఎలా ఒడిసి పట్టావన్నదే ముఖ్యం. 1986 ఫైనల్లో మా ఆటగాడు జార్జ్ బరుచాగా జర్మనీ ఏరియాలో ఉన్న విషయాన్ని గమనించి నేను ఇలాంటి అవకాశమే అందించా. తర్వాతంతా చరిత్రే.
ఫైనల్ వరకు ప్రయాణాన్ని గమనిస్తే, ఫ్రాన్స్ మూడు నాకౌట్ మ్యాచ్‌లను 90 నిమిషాల్లోనే ముగించింది. క్రొయేషియా మాత్రం అన్నిట్లో 120 నిమిషాలపైనే ఆడింది. డెచాంప్స్ కుర్రాళ్లు ఆటలో ఆధిపత్యం చాటారు. జాల్టొ డాలిచ్ బృందం చావోరేవో అన్నట్లు ఆడింది. ఇది క్రొయేషియా వైపు లోపాలను చూపుతోంది. చూసేందుకు బెదురే లేని పోరాటతత్వంతో కనిపిస్తోంది. విశేషమైన బాల్కన్ ఫుట్‌బాల్ సంప్రదాయాన్ని చాటుతూ వారు గొప్ప స్ఫూర్తిని చాటారు. ఫైనల్ రెండు భిన్న దృక్పథాల మధ్య సాగనుంది. ఫ్రాన్స్ ఆధిపత్యం చాటినా అది ఆసాంతం కాకపోవచ్చు. డెచాంప్స్ విశిష్ట శిక్షణలో వారు రాటుదేలారు. బ్యాక్‌లైన్, మిడిల్‌లో బలంగా ఉంటూ మ్యాచ్‌ను ఆధీనంలోకి తీసుకుంటున్నారు. జట్టులో ఏ రంగు వారున్నారన్నది ఎందుకు పట్టించుకుంటారో నాకర్థం కాదు. వీరే ఫ్రాన్స్‌ను 2016 యూరో కప్ ఫైనల్ చేర్చినందున ఇది సహజమైనదే అనుకోవచ్చు. అçప్పటి ఓటమి చేదు అనుభవాలను చెరిపేసేందుకు ఇది మంచి వేదిక. చర్చంతా ఫ్రాన్స్ ఫార్వర్డ్ ఎంబాపె చుట్టూనే సాగుతోంది. కానీ జట్టులో అతడి కంటే ఎవరూ తక్కువ కాదు. అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు సమర్థులు ఉన్నారు. పోగ్బా, కాంటె ప్రత్యర్థుల కదలికలను దెబ్బతీసి... దాడులకు అవకాశమిస్తారు. దీంతో ఎంబాపె, గ్రీజ్‌మన్‌లకే కాదు డిఫెండర్లకూ గోల్ చేసే వీలు చిక్కుతోంది. క్రొయేషియా నాకౌట్ విజయాలు వెనుకబడి పుంజుకోవడంతో వచ్చినవే. ఒక్కసారి అయితే ధైర్యవంతులు అనుకోవచ్చు. ప్రతి సారి అంటే వారు సామాన్యులు కాదని అర్థం. పోరాడే జట్లను నేను ప్రేమిస్తా. క్రొయేషియా ఇదే చేస్తే... ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment