1122 నుంచి 578కి...  | final list of IPL auction is released | Sakshi
Sakshi News home page

1122 నుంచి 578కి... 

Published Sun, Jan 21 2018 1:42 AM | Last Updated on Tue, Oct 2 2018 6:27 PM

final list of IPL auction is released - Sakshi

ముంబై:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌–11 కోసం వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ శనివారం వెల్లడించింది. మొత్తం 578 మంది క్రికెటర్లు వేలం కోసం అందుబాటులో ఉన్నారు. వీరిలో భారత క్రికెటర్లు 360 మంది కాగా, మరో 218 ఇతర దేశాల ఆటగాళ్లు. ఇందులోంచి గరిష్టంగా 182 మందికి లీగ్‌లో ఆడే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్‌కు చెందిన ఎనిమిది జట్లు మొత్తం 18 మంది ఆటగాళ్లను వేలంలోకి రాకుండా తాము అట్టి పెట్టుకున్నాయి. ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో ఈ వేలం జరుగుతుంది. ఇటీవల 1122 మంది క్రికెటర్లు తామూ ఐపీఎల్‌లో భాగం అవుతామంటూ తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఫ్రాంచైజీల ఎంపిక, ఇష్టా ఇష్టాలననుసరించి ఐపీఎల్‌ ఈ జాబితాను దాదాపుగా సగానికి కుదించింది. 16 మందిని మార్క్యూ ఆటగాళ్లుగా ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ గుర్తించింది. అశ్విన్, ధావన్, డు ప్లెసిస్, గేల్, పొలార్డ్, రహానే, స్టార్క్, స్టోక్స్, బ్రావో, గంభీర్, షకీబ్, మ్యాక్స్‌వెల్, రూట్, హర్భజన్, యువరాజ్, విలియమ్సన్‌ ఈ జాబితాలో ఉన్నారు. మొత్తం 36 మంది రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి రానున్నారు. రూ.1.5 కోట్ల కనీస ధర ఉన్న ఆటగాళ్లు 32 మంది కాగా... రూ. 1 కోటి కనీస ధరతో 31 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అందుబాటులో ఉన్న క్రికెటర్లలో భారత్‌కు చెందిన 298, ఇతర దేశాలకు చెందిన 34 మంది అన్‌క్యాప్డ్‌ ఆటగాళ్లు ఉండగా, అసోసియేట్‌ దేశాలనుంచి ఇద్దరికి చోటు దక్కింది. ఫ్రాంచైజీల ప్రత్యేక విజ్ఞప్తి మేరకు 9 మంది క్రికెటర్లను కౌన్సిల్‌ తుది జాబితాలో చేర్చింది. ఇందులో భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌  అజహరుద్దీన్‌ కుమారుడు అసదుద్దీన్‌ కూడా ఉండటం విశేషం. అసద్‌ ఇప్పటివరకు స్థానిక క్లబ్‌ స్థాయి క్రికెట్‌ మినహా సీనియర్‌ స్థాయిలో ఏ జట్టుకూ ఏ ఫార్మాట్‌లోనూ ఆడలేదు.  

స్టోక్స్‌కు గ్యారంటీ! 
స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ఎంచుకునే విషయంలో గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రత్యేక హామీ ఇచ్చింది. ఒకవేళ పోలీసు విచారణ కారణంగా స్టోక్స్‌ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండలేని పరిస్థితి వస్తే అతని స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవచ్చని కౌన్సిల్‌ స్పష్టం చేసింది. అయితే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడిన తర్వాత స్టోక్స్‌ స్వదేశం వెళితే మాత్రం ఇది వర్తించదని, అతని స్థానంలో మరొకరిని ఎంచుకునే అవకాశం లేదని కూడా జీసీ పేర్కొంది. వేలంలో స్టోక్స్‌కు భారీ డిమాండ్‌ ఉంది. గత ఏడాది రికార్డు స్థాయిలో రూ.14.5 కోట్లకు అమ్ముడుపోయిన స్టోక్స్‌...తన విలువను నిలబెట్టుకుంటూ పుణేను ఫైనల్‌ చేర్చడంతో పాటు లీగ్‌లో అత్యంత విలువైన ఆటగాడిగా నిలవడం విశేషం.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement