
అక్రమ్‌పై కాల్పులు
క్షేమంగా బయటపడ్డ మాజీ క్రికెటర్
కరాచీ : పాకిస్తాన్ బౌలింగ్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపాడు. అయితే ఈ సంఘటన నుంచి క్రికెటర్ క్షేమంగా బయటపడ్డాడు. బుధవారం యువ పేసర్లకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయ స్టేడియానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే కర్సాజ్ ప్రాంతంలో అక్రమ్ నడుపుతున్న కారు స్వల్ప ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోయింది. అదే సమయంలో పక్క కారులో నుంచి ఓ గుర్తు తెలి యని వ్యక్తి కిందకు దిగి ఒక్కసారిగా ఫైరింగ్‌కు దిగాడు.
అయితే అక్రమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరగలేదని సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్, షాహిద్ ఆఫ్రిది, రషిద్ లతీఫ్‌లతో పాటు పలువురు రాజకీయ నాయకులు జరిగిన సంఘటనను ఖండించారు.