ఆశల పల్లకిలో...119 మందితో
భారత బృందం సిద్ధం
రియో: గత ఒలింపిక్స్‌ను మించిన ప్రదర్శనతో, మరిన్ని పతకాలు సాధించే లక్ష్యంతో భారత క్రీడాకారులు రియోలో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యారు. ఒలింపిక్స్‌లో తొలి సారి మన దేశంనుంచి వంద మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటుండటం విశేషం.
ఈసారి సుమారు 10 పతకాలు వస్తాయని ఆశ. షూటింగ్‌లో బింద్రా, నారంగ్, రెజ్లింగ్‌లో యోగేశ్వర్, బ్యాడ్మింటన్‌లో సైనా, సింధులకు పతకం సాధించే సత్తా ఉంది. మహిళల ఆర్చరీలో దీపికా కుమారి, బాక్సింగ్‌లో శివ థాపా, మనోజ్ కుమార్ మెడల్ అందుకోగల సమర్థులు. ఇటీవల నిలకడగా రాణిస్తున్న పురుషుల హాకీ జట్టునుంచి కూడా అభిమానులు పతకం ఆశిస్తున్నారు. టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ జోడి సానియా మీర్జా-రోహన్ బొపన్న పతకం గెలిచేందుకు ఇది సరైన తరుణం. అథ్లెటిక్స్‌లో ఎక్కువ మంది వెళుతున్నా... మెడల్ కోసం ఏదైనా సంచలనం జరగాల్సిందే.