
సాక్షి, కోల్‌కతా: శ్రీలంక సిరీస్ అనంతరం అత్యంత కఠినమైన సిరీస్ దక్షిణాఫ్రికాతో ఉందని, ఆ సిరీస్ దృష్ట్యా లంక సిరీస్ చాల ముఖ్యమని టీమిండియా టెస్టుల వైస్ కెప్టెన్ అజింక్యా రహానే అభిప్రాయపడ్డారు. ఈనెల 16న శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా ఈడెన్ గార్డెన్‌లో ప్రాక్టీస్ సెషన్ అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘టెస్టుల్లో నెం1 ర్యాంకులో ఉన్నాం. ప్రతిసిరీస్ మాకు ముఖ్యమే. ప్రతీది గెలవాలనుకుంటున్నాం. ఇక్కడి పరిస్థితులు మాకు బాగా తెలుసు. వచ్చే ఏడాది ప్రారంభంలో కఠినమైన సిరీస్ దక్షిణాఫ్రికా పర్యటన ఉంది. అక్కడ రెండు నెలలపాటు మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్నాం. ఇది చాలా కఠినమైన సిరీస్. దీంతో ఈ పర్యటన ముందు లంకతో జరుగుతున్న సిరీస్‌లో ప్రతి మ్యాచ్ ముఖ్యమే. దక్షిణాఫ్రికా పరిస్థితులు పూర్తిగా విభిన్నం. దీనికి ఈ సిరీస్‌లోనే సిద్ధమవుతాం.
లంకను తక్కువ అంచనా వేయడం లేదు. శ్రీలంక టీమ్‌ను గౌరవిస్తాం. మా బలాలపైనే పూర్తిగా దృష్టి సారించాం. ఆటగాళ్లంతా అన్ని ఫార్మట్లకు దగ్గట్లు సిద్దం అవుతున్నారు. ఒత్తిడి, అలసటను తగ్గించుకోవడానికి మసాజ్, ఈత, ఐస్ బాత్ సెషన్స్‌లో పాల్గొంటున్నాం. టీమ్ మేనేజ్‌మెంట్ మా ఫిట్‌నెస్‌పై కేర్ తీసుకుంటుంది.’ అని రహానే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment