
'మసూద్ తలను ఇవ్వండి'
సిమ్లా: భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఈ నెల 19న ధర్మశాలలో జరగాల్సిన టి20 ప్రపంచకప్ మ్యాచ్‌పై నిరసన గళం తీవ్రతరమైంది.ఒకవేళ మ్యాచ్ను ఇక్కడ నిర్వహించాలనుకుంటే ముందుగా పాకిస్తాన్ మిలిటెంట్ మసూద్ అజహర్ తలను భారత్కు అప్పగించాలంటూ మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ మంత్రి మేజర్ విజయ్ సింగ్ మంకోతియా డిమాండ్ చేశారు. ఈ అంశంపై మంకోతియా నేతృత్వంలో సమావేశమైన మాజీ సైనికులు బీసీసీఐని హెచ్చరించారు.
'ఇరు జట్ల మధ్య మ్యాచ్ను ధర్మశాలలో నిర్వహించాలనుకుంటే పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజహర్ తలను అప్పగించాలి. దాదాపు ఏడు వేల మంది కశ్మీర్ మీదుగ పాకిస్తాన్ నుంచి మ్యాచ్ చూసేందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండా ధర్మశాల స్టేడియంలో ఎగురుతుంది. అప్పుడు పరిస్థితులు మరింత క్షీణిస్తాయి. పాకిస్తాన్-భారత్ మ్యాచ్ను ఇక్కడ నిర్వహించడానికి మేము వ్యతిరేకం. దానికోసం ఎందకైనా వెళతాం. ఇప్పటికే ఆపరేషన్ బలిదాన్(త్యాగం)ను చేపట్టడానికి సమాయత్తమయ్యాం' అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరోసారి బెదిరింపులకు దిగింది. ఐసీసీ టీ-20 వరల్డ్ కప్‌లో తమ జట్టుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించడంతోపాటు, ఈ టోర్నీలో పాక్ ఆడనుందని భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటన చేయాలని, లేదంటే తాము మెగాటోర్నీ నుంచి తప్పుకొంటామంటోంది.
'భారత్‌కు వచ్చేందుకు మాకు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. మేం కూడా రావాలనుకుంటున్నాం. కానీ మాకు భరోసా కావాలి. ఈ విషయమై వారు ఒక ప్రకటన చేస్తే మాకు భద్రత కల్పించగలరని భరోసా లభిస్తుంది. నేను బీసీసీఐతో మాట్లాడాను. వారు ప్రైవేటుగా భరోసా ఇస్తున్నారు. అంతర్గత రాజకీయాల వల్ల బహిరంగ ప్రకటన చేయలేమంటున్నారు. పాక్ జట్టు రావాలని కోరుతున్నారు. కానీ, బహిరంగ ప్రకటన తప్పకుండా ఇవ్వాల్సిందే.ఇందుకు ప్రకటన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాం. దీనిపై చివరినిమిషం వరకు వేచిచూస్తాం. ప్రకటన రాకపోతే చివరి నిమిషంలో ఈ టోర్నీ నుంచి తప్పుకోవడానికి వెనుకాడం' అని షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు.