అబద్ధపు సాక్ష్యాలతో ఇరికిస్తున్నారు!
వెల్టింగ్టన్: మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కెయిన్స్ మరోసారి తాను ఏ తప్పూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తనను ఈ కేసులో ఇరికించేందుకు తప్పుడు ఆధారాలు సృష్టిస్తున్నారని ఏకరువు పెట్టాడు. ఈ ఫిక్సింగ్ కేసుకు సంబంధించి మెట్రోపాలిటన్ పోలీసులు తనపై నిరాధరమైన సాక్ష్యాలను సృష్టించడానికి యత్నిస్తున్నారడన్నాడు. ఇప్పటికే ఐసీసీ విచారణ ఎదుర్కొంటున్న కెయిన్స్.. తనపై వచ్చిన ఫిక్సింగ్ ఆరోపణలను కొట్టిపారేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బహిరంగ కోర్టులో కలవడానికి కనీసం ఒక అవకాశం వస్తే తాను సచ్ఛీలుడిగా ప్రపంచం ముందు నిరూపించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ నెల 25 వ తేదీన కేసుకు సంబంధించిన అభియోగ పత్రాలను పోలీసులు కోర్టు ముందుంచనున్నారు.
2010లో ఫిక్సింగ్ ఆరోపణలపై అతనికి లండన్ హైకోర్టులో ఊరట లభించనప్పటికీ.. ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోడీపై కేసు దాఖలైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మ్యాచ్ లతో పాటు అంతకుముందే అతను స్వదేశీ మ్యాచ్ లను ఫిక్సింగ్ చేసినట్లు ఓ వైబ్ సైట్ కథనాలు వెలుగుచూశాయి. ఈ ఘటనకు సంబంంధించి అప్పట్లో క్రిస్ కెయిన్స్ తన పూర్వ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్, డానియెల్ వెటోరిలు ఐసీసీలో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారని కెయిన్స్ వెల్లడి చేశాడు. తనను ఇరికించడంలో కైల్ మిల్స్, లూ విన్సెంట్, మెకల్లమ్‌ల పాత్ర కూడా ఉందని అతను అన్నాడు.