అనురాగ్.. నీకిది సరికాదు
లాహోర్:ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేసిన బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు విమర్శలు కురిపిస్తున్నారు. అనురాగ్ ఒక క్రికెట్ బోర్డుకు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా?లేక రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారా? అంటూ పాక్ దిగ్గజ ఆటగాడు మొహ్మద్ యూసఫ్ మండిపడ్డాడు. అనురాగ్ తాజా ప్రకటన కచ్చితమైన రాజకీయ వ్యాఖ్యగా ఉందంటూ విమర్శించాడు.
గత కొన్నేళ్ల నుంచి భారత్ తో క్రికెట్ ఆడటానికి విశ్వప్రయత్నాలు చేస్తుంటే ఇప్పుడు అనురాగ్ ఇలా వ్యాఖ్యానించడం సరికాదన్నాడు. రాజకీయాలను, క్రీడలను వేర్వేరుగా చూడాలంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) పదే పదే స్పష్టం చేస్తున్నా, అనురాగ్ మాత్రం రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారని యూసఫ్ విమర్శించాడు. ఒక బీజేపీ ఎంపీగా మీరు మాట్లాడుతున్నారా?లేక బీసీసీఐ బాస్గా వ్యాఖ్యానిస్తున్నారా?అని నిలదీశాడు. మరో పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కూడా అనురాగ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఒక స్పోర్టింగ్ బాడీలో భాగమైన బీసీసీఐ ..రాజకీయ పరమైన ఆధిపత్యం చెలాయిస్తుందనడానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణ అని ఖాదిర్ విమర్శించారు. చాలాకాలం నుంచి తమతో క్రికెట్ ఆడటానికి భారత్ మొగ్గు చూపకపోయినప్పటికీ, అనురాగ్ చేసిన ప్రస్తుత వ్యాఖ్యలతో వచ్చే లాభం ఏముందని ప్రశ్నించాడు.