పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కన్నుమూత
కరాచీ: పాకిస్తాన్ క్రికెట్ జట్టు పాత తరం క్రికెటర్ ఇంతియాజ్ అహ్మద్(88) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఉదర సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఇంతియాజ్ అహ్మద్.. శనివారం లాహోర్లో తుదిశ్వాసం విడిచారు. యాభైవ దశకంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అహ్మద్.. పాకిస్తాన్ తరపున నాలుగు టెస్టు మ్యాచ్లకు సారథ్యం వహించాడు. 1952 నుంచి 1962 వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడిన ఇంతియాజ్.. 41 టెస్టుల్లో 2079 పరుగులు చేశాడు. అటు వికెట్ కీపర్ కూడా ఇంతియాజ్ బాధ్యతలు నిర్వర్తించాడు. తన కెరీర్ లో 77 క్యాచ్లు, 16 స్టంపింగ్స్ చేశాడు. 1955లో లాహోర్ లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో ఇంతియాజ్ డబుల్ సెంచరీ సాధించాడు. అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 209.
భారత్తో పాకిస్తాన్ విడిపోకముందు నార్తరన్ ఇండియా జట్టు తరపున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో పాల్గొన్నాడు. 180 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన ఇంతియాజ్ 10,391 పరుగులు చేశాడు. ఇదిలా ఉండగా, తన అంతర్జాతీయ కెరీర్ నుంచి వీడ్కోలు తీసుకున్న తరువాత ఇంతియాజ్ సెలక్టర్గా 13 ఏళ్లు సేవలందించాడు. 1976 నుంచి 1978 వరకూ పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్గా పని చేశాడు.